హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి. దేవాలయంగా భావించే అసెంబ్లీలో.. మాజీ మంత్రి గంగులను ఒప్పించేందుకు సీఎం బేరసారాలకు దిగడం విమర్శలకు తావిచ్చింది.
బీసీలకు బీఆర్ఎస్ చేసిన సంక్షేమం గురించి గంగుల మాట్లాడుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలుగజేసుకున్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 42శాతం రిజర్వేషన్ బిల్లుపై బుజ్జగించేందుకు ‘ఈ ఒక్క విషయంలోనైనా వాళ్ల (బీఆర్ఎస్) ఒత్తిడికి లొంగకు. ఏమన్నా మంచీచెడ్డ ఉంటే నేను చూసుకుంటా.
నువ్ ఏం వాళ్లకు భయపడకు మిత్రమా.. మనం పాత మిత్రులమే కదా..? నీకు తెల్వంది ఏముంది? వాళ్ల ఒత్తిడికి లొంగకు.. వాళ్లకు ఇష్టం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ నవ్వుకున్నారు. సీఎం మాట్లాడిన ఈ మాటలు.. సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ‘నిండు సభలోనే పరోక్షంగా ముఖ్యమంత్రి లాబీయింగ్‌కు దిగారు’ అంటూ మండిపడుతున్నారు.
‘బిల్లు ఆమోదం కోసం సభలో బీఆర్ఎస్ సభ్యుల కాళ్లావేళ్లా పడుతున్నాడు’ అని రాసుకొస్తున్నారు. ‘తనకు మద్దతు ఇస్తే.. మంచి-చెడు చూసుకుంటా’ అంటూ శాసనసభలోనే బేరసారాలు చేయడం సిగ్గచేటని మరో నెటిజన్ అన్నారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’ అంటూ ఇంకో నెటిజన్ అభివర్ణించాడు. ‘నిండు సభలోనే నిసిగ్గుగా బ్రీఫింగ్ చేస్తున్నారు..’ అని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యానికి మచ్చగా మారారని విమర్శిస్తున్నారు.