హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ‘తెలంగాణకు హరితహారం’ పేరును ‘వనమహోత్సవం’ అని మార్చిన కాంగ్రెస్ సర్కారు.. పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటుతామంటూ ప్రభుత్వం జూలై మొదటి వారంలో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత లక్ష్యాన్ని 16 కోట్లకు తగ్గించినట్టు తెలిపింది. ఇప్పటివరకు నిర్దేశించుకున్న లక్ష్యంలో 68శాతం, అంటే 12 కోట్ల మొక్కలు నాటామని అటవీశాఖ అధికారులు బుధవారం తెలిపారు. మిగిలిన వాటిని కూడా ఈ నెలాఖరు వరకు నాటుతామని తెలిపారు. కానీ ఏయే జిల్లాల్లో ఎన్ని మొక్కలు నాటారనే వివరాలను వెల్లడించడంలేదు. అధికారిక లెక్కలను గోప్యంగా ఉంచడంపై పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో శరవేగంగా పచ్చదనం పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని కీలకంగా భావించింది. విద్యార్థులు, యువత, మహిళా సంఘాలు, పర్యావరణవేత్తలు సహా సమాజంలోని అందరినీ భాగస్వాములు చేస్తూ ఏటా 20కోట్ల మొక్కలు నాటింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు 18కోట్ల మొక్కలు నాటామని, ఈ సారి 12కోట్ల మొక్కలు నాటామని చెప్తున్నది. ప్రభుత్వం కాగితాల్లో లెక్కలు చూపుతున్నా.. ఏ రోజు, ఎక్కడ, ఎన్ని మొక్కలు నాటారో ఎందుకు చెప్పడంలేదని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. పథకాన్ని క్రమంగా ఎత్తేస్తారా? అని నిలదీస్తున్నారు.