హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్‌ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది. ఎక్కడా ఆ రిపోర్టునూ బయటపెట్టడడం లేదు. ఆ నివేదికను అసెంబ్లీలోనూ నివేదించలేదు. ఇంటింటి సర్వే గణాంకాలను కులాల వారీగానూ బహిర్గతం చేయలేదు. గతంలోనూ 42శాతం రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ కమిషన్ సమర్పించిన నివేదికనూ కాంగ్రెస్ సర్కారు వెల్లడింలేదు. ఇప్పుడు అదే 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని తేల్చిన సర్కార్.. మళ్లీ కొత్త నివేదికను తెచ్చింది. మరి ఇప్పుడైనా ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును బయటపెట్టలేకపోయింది. ఇదే దశలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఇష్టారీతిన జీవో 46ను తీసుకొచ్చిందని తెలుస్తున్నది. ఇలా తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ సర్కార్ తప్పిదాల మీద తప్పిదాలకు ఒడిగడుతున్నది. అదే కమిషన్ రిపోర్టు ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని అస్పష్టమైన మార్గదర్శకాలనూ తాజాగా జారీచేసింది. తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు సర్కారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని తెలిసిపోతున్నది. సర్కారు తీరుతో మరోసారి న్యాయపరమైన వివాదాలు తప్పవని బీసీ సంఘాలు, మేధావులు, న్యాయకోవిధులు మండిపడుతున్నారు.
సర్వే నివేదికను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతామని క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదికగా వెల్లడించినా, ఇప్పటివరకు ఆ నివేదికను బయటేపెట్టలేదు. సర్వే గణాంకాలను బూసాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని డెడికేటెడ్ కమిషన్‌కు అందించింది. అందుకు అనుగుణంగా ఆ కమిషన్ సైతం బీసీ రిజర్వేషన్లను సర్వే గణాంకాలకు అనుగుణంగా స్థిరీకరించాలని సిఫారసు చేస్తూ సర్కారు నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. కానీ ఆ సమయంలోనూ కమిషన్ నివేదికను సర్కారు వెల్లడించలేదు.
వాస్తవంగా డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను క్యాబినెట్ ఆమోదించాలి. ఆ తర్వాతే అసెంబ్లీ ఆమోదించా లి. ఆపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. గతంలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన సందర్భంలో సర్కారు ఇదే విధానాన్ని అనుసరించింది. కానీ ప్రస్తుతం జీవో46 జారీలో ఈ నిబంధనలను తుంగలో తొక్కింది. బీసీ రిజర్వేషన్లపై ఈనెల 20వ తేదీనే డెడికేటెడ్ కమిషన్ కొత్తగా మరో రిపోర్టును సమర్పించిందని సర్కారే వెల్లడించింది. క్యాబినెట్ ఆమోదం లేకుండా, అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండానే ఆ రిపోర్టును సిఫారసు చేస్తూనే సర్కారు తాజాగా జీవో 46ను జారీచేసింది.