హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు దిశ, దిక్కూ లేకుండా పోయింది. దీంతో ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అభ్యర్థులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడుతున్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఆగస్టులోగా నోటిఫికేషన్ వెలువడుతుందన్న నమ్మకంతో హైదరాబాద్‌కు వచ్చి పుస్తకాలతో కుస్తీ పడుతున్నామని, ఇంతవరకు ప్రభుత్వం కనీసం ఖాళీల వివరాలు కూడా తెప్పించుకోకవడం తమను తీవ్రంగా కలిచివేస్తుందని వాపోతున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ హయాంలో జారీచేసిన ఉద్యోగ నోటిఫికేషన్లే తప్ప కాంగ్రెస్ హయాంలో చెప్పుకోదగ్గ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీవో) పేరుతో తమ నోట్లో మట్టి కొట్టొద్దని పోలీసు ఉద్యోగార్థులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎస్పీవోల నియామకాలు జోరుగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 1,200 మందికిపైగా ఎస్పీవోలను నియమించి, నెలకు రూ.26 వేల చొప్పున వేతనం ఇస్తున్నట్టు తెలుస్తున్నది. వీరంతా ఆర్మీ, బీఎస్ఎఫ్, పారమిలటరీ బలగాల్లో పనిచేసి రిటైర్డ్ కావడంతో ఇటు వేతనం తీసుకుంటూనే అటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందుతున్నారని, ఇలాంటివారిని ఎస్పీవోలుగా నియమించడం ఏం పద్ధతని ప్రశ్నిస్తున్నారు. ఈ విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల పొట్ట కొడుతున్న ఎస్పీవో వ్యవస్థను రద్దు చేయాలంటూ ట్రై కమిషనరేట్ల పరిధిలోని ఓ యువ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎస్పీవోల నియామకానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ నేతల మోసంపై ఆందోళనలకు ఉద్యోగార్థులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీస్ ఉద్యోగాల కోసం శాసనసభను ముట్టడించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగార్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా పోలీస్ ఉద్యోగాలకు ఆగస్టు చివరిలోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు జీవో 46 బాధితులతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నారు.