Medical PG | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : మెడికల్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతున్నది. స్థానికతను నిర్ధారించడంలో విఫలమైన వైద్యారోగ్య శాఖ.. ఇప్పటికే యూజీ విద్యార్థుల కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేసి వేలాది మంది విద్యార్థులను ముప్పుతిప్పలు పెట్టింది. తాజాగా పీజీ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నది. ఓవైపు ఆలిండియా కోటా కౌన్సెలింగ్ రెండో దశ పూర్తయింది. మరోవైపు శుక్రవారం నుంచి పీజీ తరగతులు మొదలయ్యాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు స్థానిక కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు.
ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. పీజీ అడ్మిషన్లలో ‘స్థానికత’పై ప్రభు త్వం విడుదల చేసిన జీవోలను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఇతర రాష్ర్టాల వారిని కూడా స్థానిక కోటాలో పరిగణించాలని ఆదేశించింది. ఈ తీర్పును వైద్యారోగ్య శాఖ అమలుచేయడమో లేదా సుప్రీంకోర్టుకు వెళ్లడమో తేల్చుకోవాల్సి ఉన్నది.
ఉత్తర్వులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తున్నదని లీకులు ఇచ్చి చేతులు దులుపుకున్నది. కౌన్సెలింగ్ ఎప్పుడు తెలియక దాదాపు 8 వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆలిండియా కోటా కింద అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయింది. ఇలాగే ఆలస్యం చేస్తే ఆలిండియా కోటా అడ్మిషన్లు పూర్తవుతాయని, తాము రెంటి కి చెడ్డ రేవడిలా మిగిలిపోతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరు ఆలిండియా కోటా అడ్మిషన్ల కోసం రూ.25 వేల ఫీజు చెల్లించారని, అది కూడా నష్టపోయే అవకాశం ఉన్నదని వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ ఈ అంశంపై దృష్టిసారించాలని విద్యార్థులు కోరుతున్నారు.