KTR | నిన్న సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా బోనస్ కాదు అది బోగస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. పండుగ వేళ.. ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోందని అన్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడారు. సింగరేణి లాభాల బోనస్ అంతా బోగస్‌గా మారిపోయిందని అన్నారు. ప్రతి సింగరేణి కార్మికుడు కనీసం లక్షా 80వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ సింగరేణి నికర లాభం రూ.4701 కోట్లలో.. న్యాయంగా 33 శాతం వాటా 1,551 కోట్లు కావాలి.. ప్రతి కార్మికుడికి 3.70 లక్షల రూపాయలు రావాలి. కానీ కేవలం 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచుతున్నారు.’ అని వివరించారు. ఇస్తే మొత్తంగా లాభాల్లో వాటా ఇవ్వాలి, లేకపోతే మేము ఇచ్చేది కేవలం 16.9% మాత్రమే అని ఒప్పుకోవాలని సూచించారు. కానీ 33% అంటూ సింగరేణి కార్మికుల లాభాల వాటాపై అసత్యాలు చెప్పవద్దని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మొత్తం పది సంవత్సరాల్లో కార్మికులకు లాభాల వాటా రూపంలో దక్కింది కేవలం 365 కోట్ల రూపాయలు మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. కానీ భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో లాభాల వాటా రూపంలో సింగరేణి కార్మికులకు అందించింది 2780 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సంస్థ లాభాలు పది, పదిహేను శాతానికి మించి ఏనాడు ఇవ్వలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా లాభాలు పెరిగేలా సంస్థ పనితీరును పెంచామని.. ఒక్కొక్క కార్మికుడికి అత్యధికంగా 32% వాటా ఇచ్చామని చెప్పారు. మేము అధికారంలో వచ్చే నాటికి 17 వేల రూపాయల లాభాల వాటా ఉంటే, అధికారంలోకి దిగిపోయినప్పుడు లక్షా డెబ్బై వేల రూపాయల వరకు ప్రతి కార్మికుడికి లాభాల వాటా ఇచ్చామని తెలిపారు.
సింగరేణి ప్రాంతంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానమా ఇది అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించినందుకు కార్మికుల పోట్టగొట్టడమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కార్మికుల హక్కులకు పూర్తిగా భంగం కలిగించేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కార్మిక లోకానికి తాము ముందే హెచ్చరించామని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణి ప్రైవేటీకరిస్తుందని ముందే హెచ్చరించామని తెలిపారు. ఆ మేరకే కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణి గనుల వేలాన్ని నిర్వహించిందని పేర్కొన్నారు. బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు వేలంలో నవ్వుతూ పాల్గొన్నారని తెలిపారు.
లాభాల్లో కార్మికుల వాటా తగ్గించడం అంటే, భవిష్యత్తుతో సింగరేణి కార్మికుల ఆత్మస్థైర్యాన్ని, భాగస్వామ్యాన్ని తగ్గించి సింగరేణి ప్రైవేటీకరించే కుట్రగానే భావిస్తున్నామని కేటీఆర్ అన్నారు. సింగరేణి లాభాల వాటాపైన సింగరేణి కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సింగరేణి ప్రాంతంలో గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి దగ్గరికి పంపించాలని సూచించారు. సింగరేణి ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంలో స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి అధికార గుర్తింపు సంఘంతో పాటు, కూనంనేని సాంబశివరావు, బీజేపీ నేతలు కూడా ఈ అంశంలో స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మా సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా ఈ అంశంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.