హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధిలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటాపై విడుదల చేసిన జీవో 9 కొట్టుడుపోతదని తెలిసే డ్రామాలు ఆడి బలహీనవర్గాలకు నమ్మకద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడంతో బీఆర్ఎస్పై నెపం నెట్టి తప్పించుకొనేందుకు యత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టి రక్షణ కల్పించడంలో కాంగ్రెస్, బీజేపీ ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డా రు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రధా న కార్యదర్శి సోమ భరత్‌కుమార్, లీగల్ సెల్ ప్రతినిధి కల్యాణ్‌రావుతో కలిసి వినోద్ విలేకరులతో మా ట్లాడారు. బీసీ కోటాకు సంబంధించిన జీవో 9పై హై కోర్టు మొన్న స్టే ఇచ్చిందని, కానీ తెలంగాణ ప్రజలు దసరాకు ముందే ఈ జీవో చెల్లదని తీర్పు ఇచ్చారని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనను చూ సిన తర్వాత ఆయన ఇచ్చిన జీవోనూ ఏ ఒక్కరూ న మ్మలేదని, ముఖ్యంగా బలహీనవర్గాల ప్రజలు ఎం తమాత్రం విశ్వసించలేదని కుండబద్ధలుకొట్టారు. అందుకే దసరా పండుగ నాడు పల్లెల్లో ఎన్నికల కోలాహలం కనిపించలేదని గుర్తుచేశారు. ప్రజలు మోస పోవడానికి సిద్ధంగా ఉన్నారని పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే రేవంత్‌రెడ్డి చెప్పారని, ఇప్పుడు అదే తీరున బీసీలను మోసం చేశారని నిప్పులు చెరిగారు.
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు తప్పులు చేస్తుందని తెలిసినా బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ నాయకత్వంలో 2017 ఏప్రిల్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు. గవర్నర్ ద్వారా రాష్ట్రపతి వద్దకు.. అక్కడి నుంచి కేంద్ర హోంశాఖకు వెళ్లిన బిల్లు అక్కడే పెండింగ్‌లో ఉన్నదనే విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ‘కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రాజ్యాంగంలో 50 శాతం సీలింగ్ ఎక్కడున్నదని నిలదీశారు.. రిజర్వేషన్ల పెంపు బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టి రక్షణ కల్పించాలని అడిగారు. ఇందుకు అప్పుడు ఎంపీగా ఉన్న నేనే సాక్ష్యం.. ఈ విషయం అప్పటి బీఆర్ఎస్ నాయకులందరికీ తెలుసు. చెప్పింది అబద్ధమైతే కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నుంచి చేరిన నాయకులను అడిగి తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల పెంపుపై మొదట ప్రయత్నించింది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. కానీ మొన్న హైకోర్టు తీర్పు తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్, బీజేపీని ఒకేగాటన కట్టి నిందించారని, ఇది దుర్మార్గమని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వినోద్ ధ్వజమెత్తారు. తమ పదవులు కాపాడుకొనేందుకు, వంతపాడిన కంపెనీలను రక్షించేందుకు సుప్రీంకోర్టు తీర్పులను అధిగమించేందుకు ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేశాయని గుర్తుచేశారు. 2010లో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం సీలింగ్‌ను దాటవద్దని కృష్ణమూర్తి కేసులో తీర్పు చెప్పిన సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆక్షేపించారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రోజుకో తీరున వ్యవహరించి నాటకాన్ని రక్తికట్టించిందని వినోద్ దుయ్యబట్టారు. కేసులో ఇంప్లీడ్ కాలేదని బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.