TGSRTC | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులపై ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం ప్లాన్ ‘ఏ’తో పాటు, ప్లాన్ ‘బీ’ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నదని, సమ్మె జరగాలనే కోరుకుంటున్నదని విశ్వసనీయ సమాచారం. సమ్మె ఎందుకు జరుగుతున్నది? అనే అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగితేనే.. తాము తీసుకునే చారిత్రక నిర్ణయం ప్రజల్లోకి కూడా బలంగా వెళ్తుందనే భావనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలిసింది. ప్లాన్ ‘ఏ’ లో భాగంగా సమ్మెకు రెండు రోజుల ముందు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించి, మంత్రి సమక్షంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’పై ప్రకటన చేసి, ఆ తర్వాత ముఖ్యమంత్రితో దాని గురించి గొప్పగా చెప్పించాలనే వ్యూహంతో ఉన్నట్టు తెలిసింది.
ఒకవేళ, ప్లాన్ ‘ఏ’లో కార్మిక సంఘాలు సంతృప్తి చెందకపోతే, సమ్మెను రెండు, మూడు రోజులు కొనసాగనిచ్చి, ఆ తర్వాత మరోసారి కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించి, ‘ప్లాన్ బీ’ని అమలుచేస్తారని సమాచారం. ఎందుకంటే, ఇప్పటికే ప్రభుత్వంపై విభిన్న వర్గాల్లో వ్యతిరేకత వస్తుండగా, ఆర్టీసీ కుటుంబాలు ఏకమయ్యాయి. దీంతో ‘ఆర్టీసీ విలీనం ఎప్పటికైనా చేయాల్సిన పనే కదా.. ఇప్పుడు చేసేద్దాం’ అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అయితే, సమ్మె డిమాండ్లను ఆమోదించడం అనేది చాలా గొప్పగా ప్రకటించుకోవాలని, అవి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అందుకు సమ్మె జరిగితేనే మంచిది అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కాగా, చర్చల విషయంలో ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ఒక కీలక వ్యక్తి ఆ చర్చలను అడ్డుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సమ్మె జరుగుతున్నప్పుడే ప్లాన్ బీలో భాగంగా.. ప్రభుత్వం గొప్పగా ప్రకటించేందుకు కీలకంగా నాలుగు అంశాలను ఎంపిక చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాటిల్లో 1) ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింటెడ్ తేదీని ప్రకటించడం 2) 2021 పీఆర్సీలో 20-25% ఫిట్మెంట్ ఇవ్వడం 3) ఆర్టీసీలో యూనియన్లకు ఆమోదం తెలపడం 4) ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 60 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచడం.
ఈ 4 అంశాలను ప్రధానంగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని, ఇక మిగిలిన అంశాలపై కమిటీలు వేయడం.. లేదా వాటి అమలుకోసం కొన్ని తేదీలను ప్రకటించడం వంటివి చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆర్టీసీ విలీన ఫైలు జీఏడీ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం అపాయింటెడ్ డేని ప్రకటిస్తే, ప్రభుత్వం మీద పడే ఆర్థికభారం ఎంత? అనే అంశంపై ఆర్థిక శాఖ కూడా తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి? అనే అంశాలపై ప్రభుత్వ పెద్దలు నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం