హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కండ్లు ఉండి కూడా చూడలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నగరం నలువైపులా విస్తరిస్తూ అభివృద్ధి సాధిస్తుంటే.. చూసి ఓర్వలేక అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తతరబిత్తర మాట్లాడుతున్నారని, ఇలా తన పరువు తీసుకోవడాన్ని ఆయన అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే కుర్కురే ప్యాకెట్లు పంచుడు.. ప్యాసింజర్ లిఫ్టులు ప్రారంభించుడు కాదని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిని దుయ్యబట్టారు.
హైదరబాద్ నగరానికి ఒకపైసా కూడా అదనంగా తేలేని కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విస్తృతమైన అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో ప్రజలకు వివరిస్తే మంచిదని సూచించారు. వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు తీసుకురాలేని నిస్సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోయిన ప్రధానిని ఇదేందని కిషన్‌రెడ్డి అడగలేకపోతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి తెలంగాణ సొమ్ము తింటూ మోదీ పాట పాడుతున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేంద్ర నిధులతో ఏమి అభివృద్ధి చేశారో కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దాని ఫలాలను నగర ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఅర్ఎంపీ కార్యక్రమాలు, వైకుంఠధామాలు, ఫుట్ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలే నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు పూర్తి
అభివృద్ధిలో రోజురోజుకూ కొత్త పుంతలు తొకుతున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎస్ఆర్డీపీ కింద రూ. 5660.57 కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టగా వాటిలో 32 పనులు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. ఈ ఏడాదే 11 పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. చెప్పుకుంటూ పొతే తాము చేసిన అభివృద్ధి పనుల జాబితా అంతులేనిదని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్యాసింజర్ లిఫ్ట్‌లను ప్రారంభించడం, కుర్కురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కిషన్‌రెడ్డి, పనికిమాలిన మాటలు మానుకొని హైదరాబాద్‌కు నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు అదనంగా ఒక రూపాయి కూడా ఇవ్వని మోదీ సర్కారుకు, కిషన్‌రెడ్డికి తమను విమర్శించే అర్హతనే లేదని స్పష్టంచేశారు.
మూడేండ్లు అయినా పూర్తి కాని అంబర్పేట్ ఫ్లైఓవర్
కిషన్‌రెడ్డి ఆయన సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు మూడేండ్ల నుంచి సాగుతున్నా పట్టించుకోవడంలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ఫ్లైఓవర్ పనుల్లో జాప్యం వల్ల రోడ్ల మీద ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నా ఏమాత్రం చలించని కిషన్‌రెడ్డి, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం అజ్ఞానం, అవగాహనా రాహిత్యం అని కేటీఆర్ మండిపడ్డారు.