జగిత్యాల, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీ విద్య అధ్వానంగా మారింది. సర్కారు నిర్లక్ష్యం.. పేద పిల్లలకు శాపంగా పరిణమించింది. నేటి పిల్లలను భావిభారత శాస్త్రవేత్తలుగా నిలిపేందుకు సర్కార్ జూనియర్ కళాశాలల్లో ఏటా నిర్వహించే ప్రయోగాలను ప్రభుత్వం పాతరేస్తున్నది. ‘ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తాం. కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు దీటుగా సంస్కరిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన, ప్రయోగాత్మక, పరిశీలనాత్మక, గుణాత్మక విద్యను అందిస్తాం’ అంటూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఊదరగొట్టడమే గానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్, థీయరీ పరీక్షల తేదీలు ప్రకటించారు. ఇంతవరకు విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తిస్థాయిలో నిర్వహించే పరిస్థితులు లేవని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం పూర్తిగా పూర్తికావొస్తున్నా, ప్రాక్ట్టికల్ పరీక్షలకు కావాల్సిన రికార్డులను పిల్లలతో లెక్చరర్లు రాయిస్తున్నా, ప్రాక్ట్టికల్స్ నిర్వహించేందుకు మెటీరియల్ కొరత తీవ్రంగా వేధిస్తున్నది.
ప్రాక్టికల్స్ నిర్వహణకు నిధులు సున్నా
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహణ నిమిత్తం మంజూరు కావాల్సిన నిధులు ఈ విద్యా సంవత్సరం ఇంతవరకు మంజూరు కాలేదు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 405 ఉన్నాయి. ఇందులో ఒక్క కాలేజీకి కూడా నిధులు మంజూరు కాకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 57 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నడుస్తున్నాయి. అన్ని కాలేజీల్లోనూ ఎంపీసీ, బైపీసీ కోర్సులు నిర్వహిస్తున్నారు. కొన్ని కాలేజీల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎమ్ఎల్టీ, ఫిషరీస్, రేడియో అండ్ టీవీ, సీజీడీఎం వంటి వృత్తి విద్యాకోర్సులు చెప్తున్నారు. ఎంపీసీ, బైపీసీ కోర్సులకు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ సబ్జెక్టులకు సెకండియర్‌లో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలి. శాస్త్ర, సాంకేతిక కోర్సులపై పిల్లలకు ఇక్కడే అవగాహన, ఆసక్తిని కల్పించాలి. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వం ఒక్కో కాలేజీకి రూ.25వేల చొప్పున నిధులు కేటాయించాలి. కానీ ప్రాక్టికల్ పరీక్షలకు తేదీలు కూడా ఖరారైనా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణమని అధికారులు, అధ్యాపకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో వసతుల కల్పన
కేసీఆర్ ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించింది. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే ఉన్న 57 జూనియర్ కాలేజీలకు అవస్థాపన సౌకర్యాల కల్పనకు నిధులను మంజూరు చేసింది. ప్రతి జూనియర్ కాలేజీలోనూ అదనపు తరగతి గదులు, ప్రహరీలు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించింది. విద్యాపరమైన విషయాల్లో ప్రతి కాలేజీకి గ్రంథపాలకుడు, క్రీడా ఉపన్యాసకుడి పోస్టులను మంజూరు చేసింది. ప్రతి జూనియర్ కాలేజీకి 2.50 లక్షల విలువైన క్రీడా సామగ్రిని కొనుగోలు చేసి అందజేసింది. ప్రతి కాలేజీకి రూ.4 లక్షల వ్యయంతో నాలుగు ప్రయోగశాలలు, పరికరాలు, సామగ్రి అందజేసింది. ఆన్లైన్ పద్ధతిలో హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది.
నిఘాలో పరీక్షలు.. ఆందోళనలో విద్యార్థులు
ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్ట్టికల్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహణ, మూల్యాంకనం జరిగేది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు నిబంధనలను మార్చింది. సర్కార్ జూనియర్ కాలేజీలతోపాటు, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లోనూ ప్రాక్ట్టికల్, థీయరీ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరపాలని నిర్ణయించింది. అన్ని జూనియర్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ సీసీ కెమెరాలను జిల్లాల స్థాయిలో ఆర్ఐవో, రీజనల్ జాయింట్ డైరెక్టరేట్, ఇంటర్ కమిషనరేట్‌కు అనుసంధానాన్ని కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై పెట్టిన శ్రద్ధ.. ప్రయోగశాలల నిర్వహణకు నిధులు మంజూరు చేయడంపైనా ఎందుకు పెట్టడంలేదని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. అత్యంత కీలకమైన ఇంటర్మీడియెట్ ప్రాక్ట్టికల్స్ నిర్వహించకపోతే సబ్జెక్టులపై అవగాహన కలుగదని, భవిష్యత్తు చదువులపైనా ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. ఆర్థిక స్తోమత లేకనే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నామని, తమ పరిస్థితి అర్థం చేసుకొని నిధులు కేటాయించి, తమ జ్ఞాన సముపార్జనకు సహకరించాలని విద్యార్థులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని విద్యార్థి నేతలు విమర్శిస్తున్నారు.