హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్‌కు ఓటేయకుంటే పథకాలు రద్దవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ముఖం చూడనని మంత్రి అజారుద్దీన్.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారో? వారి అంతు చూస్తానని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బెదిరింపులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? ఆయా అం శాలపై బీఆర్ఎస్ సమగ్రమైన ఆధారాలు సమర్పించినా వారిపై సీఈవో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు సీఈవో ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో కేసీఆర్, జగదీశ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో ఆంక్షలు విధించారని గుర్తుచేశారు. ‘ప్రతిపక్ష నాయకులకు ఓ రూలు.. అధికార పక్షానికి మరో రూలా? ఇదేం ద్వంద్వ వైఖరి?’ అంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించ కుంటే కోర్టుల్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.
కొందరు పోలీసులు, మరికొందరు అ ధికారులు.. కాంగ్రెస్ నాయకులకు కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ ఆరోపించారు. సీఎం రేవంత్, మంత్రులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా నోటీసులు కూడా జారీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులపై బీఆర్ఎస్కు నమ్మకం లేదని చె ప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బీఆర్ఎస్ నాయకులను తిరగనీయబోనని, తన అడ్డా దాటనీయబోనని బెదిరించినా కనీసం కేసు పెట్టకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రని వినోద్‌కుమార్ తెలిపారు. పో లింగ్ రోజున రిగ్గింగ్ చేసేందుకు యత్నిస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. దొడ్డిదారిలో గెలిచేందుకు దొంగ ఓట్లు వేయించేందుకు సిద్ధమైనట్లు తమకు స్పష్టమైన సమాచారం ఉన్నదని పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనపై అనేకసార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓ కుల సంఘం సమావేశం లో కమ్యూనిటీ భవనానికి రూ.8 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు.