హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదురొంటున్నారని, తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుసంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి సాగర్లు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, కొనుగోలును వేగంగా పూర్తి చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కోసం రైతులు రోజులతరబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాల్‌కు రెండు నుంచి 4కిలోల వరకు తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల మొకజొన్న, వరి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, కూరగాయలు, చెరుకు తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రారంభించకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు తెలిపారు.