హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా గ్యాంగ్‌టక్ వెస్ట్‌బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 10 వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 7,8 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీజేసినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది. అత్యధికంగా ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 4.74 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో 3.39, చింతలమానెపల్లిలో 3.18, వాంకిడిలో 2.77, భూపాలపల్లి జిల్లా ముత్తారం, మహాదేవ్‌పూర్‌లో 4.65, పల్మెలలో 3.28, ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్లో 3.07, సాత్నాలలో 2.88, ఇచ్చోడలో 2.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
ఈ నెల సాధారణ సగటు వర్షపాతం 227.4 మిల్లీమీటర్లు కాగా, ఆదివారం నాటికి 25.7 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా 44.8 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి సీజన్ గడిచి నెలరోజులు దాటినా.. ఇప్పటికీ 10 జి ల్లాల్లోని 222 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వివరించింది.