హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులు వాతావరణం భిన్నంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాన్లు, వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల భానుడి ప్రతాపం కొనసాగనున్నదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈనెల 10 నుంచి కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోనుండగా, మరికొన్ని జిల్లాల్లో మాత్రం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని వెల్లడించింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది.
హైదరాబాద్లో 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రజలు ఎండల పట్ల అలర్ట్గా ఉండాలని సూచించింది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించగా, కామారెడ్డి, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో రైతులకు చేతికొచ్చిన పంట తడిసి ముద్దాయిందని పేర్కొన్నది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.