హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రోహిణి కార్తెలోనే రావడంతో కొన్నిరోజులు వర్షాలు కురిశాయని, ఆ తర్వాత రాష్ట్రంలో రుతుపవనాల కదలిక మందగించడంతో తగ్గుముఖం పడ్డాయని పేర్కొన్నది. దీంతో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరగటంతోపాటు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఉదయం మేఘావృతమైన వాతావరణం.. మధ్యాహ్నం సమయంలోఎండ తీవ్రత ఉంటుందని వివరించింది.
మంగళవారం కొన్ని జిల్లాల్లో గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వారంరోజుల తర్వాత యథావిధిగా మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని పేర్కొన్నది. గడిచిన 24గంటల్లో పలు జిల్లాలో వానలు కురవగా, నల్లగొండ జిల్లా గుడిపల్లిలో 9.8 మి.మీ, వికారాబాద్ జిల్లా జహీరాబాద్లో 5.8 మి.మీ, నారాయణపేట జిల్లా కోస్గిలో 4.3 మి.మీ, వనపర్తి జిల్లా ఘన్పూర్లో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.