Uttam Kumar Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : తేమ 17శాతానికి మించి ఉంటే ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదని, ఇది జాతీయ విధానమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం తేవాల్సిందేనని స్పష్టంచేశారు. హైదరాబాద్ జలసౌధ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్రం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని మంత్రి కొట్టిపారేశారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములై, లబ్ధిదారులతో కలసి భోజనం చేయాలని సూచించారు.