మహబూబ్ నగర్ : రానున్న రోజులలో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీని వాస్ గౌడ్ అన్నారు .మంగళవారం మహబూబ్ నగర్ బస్సు డిపోనకు నూతనంగా కేటాయించిన సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ మధ్య పటిష్టమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఇతర ఉద్యోగుల మాదిరిగా భరోసా కల్పించే విషయం ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని వెల్లడించారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆర్టీసీలో అధునాతన సౌకర్యాలతో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైనందున జిల్లాలో ఆర్టీసీని కూడా పటిష్ట పరిచనున్నట్లు వెల్లడించారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ నిదర్శనమని, ప్రైవేటు వాహనాలలో ప్రయాణించడం సురక్షితం కాదని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ పట్టణంలో సిటీ బస్సులతో పాటు ,ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడిపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కే.సీ నర్సింహులు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, రీజినల్ మేనేజర్ శ్రీదేవి, ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత,ఇతర అధికారులు, ఆర్టీవో నరేశ్ కుమార్, డీఎస్పీ మహేశ్, ఆర్టీసీ నాయకులు జి ఎల్ గౌడ్ , జీఎస్ చారి తదితరులు పాల్గొన్నారు