KTR | హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. లంబాడా తండాలను గ్రామ పంచాయితీలుగా చేసింది కేసీఆర్ అని చెప్పారు. 3146 కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు 3146 మంది గిరిజన బిడ్డలు సర్పంచ్‌లు అయ్యారని తెలిపారు. గిరిజన తండాల్లో ఇంటింటికీ నీటి వసతి కల్పించామని పేర్కొన్నారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు కేసీఆర్ ఒకే రోజు పోడు పట్టాలిచ్చారని అన్నారు. గిరిజన బిడ్డల విద్య కోసం వందలాది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు.
గిరిజన బిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్‌దే అని కేటీఆర్ స్పష్టం చేశారు. గిరిజన వ్యాపారవేత్తలకు సీఎంఎస్టీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చామని అన్నారు. బంజారా బిడ్డలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చామని అన్నారు. ప్రతి జిల్లాలో బంజారా భవన్‌కు స్థలం ఇచ్చామని, బంజారా భవన్లు కట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో బంజారాలకు మరింత అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చిన చోట అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుందని మండిపడ్డారు. పోలీసులతో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆ అరాచకాలను మా కార్యకర్తలు దీటుగా ఎదుర్కొంటున్నారని తెలిపారు.