Crime news : అసోం (Assam) లోని సీఆర్పీఎఫ్ క్యాంపు (CRPF camp) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు చెందిన ఓ సీఆర్పీఎఫ్ అధికారి ఇద్దరు తోటి జవాన్లను కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అసోంలోని నాగావ్ జిల్లా (Nagao district) కతిమరిలో గల సీఆర్పీఎఫ్ 34వ బెటాలియన్ క్యాంపు ప్రధాన ద్వారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఎస్ఐ బల్లాని ప్రేమాంబరం విధుల్లో ఉన్న తోటి జవాన్లపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ప్రేమాంబరం అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతంతో క్యాంపులో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాల్పులకు దారితీసిన కారణాలపై విచారణ ప్రారంభించారు.