పెద్దపల్లి : రాష్ట్రంలో అకాల వర్షం, వడగళ్లవానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar )తెలిపారు. పెద్దపల్లి జిల్లా(Peddapalli) ఓదేల, సుల్తానాబాద్, శ్రీరాంపూర్ మండలాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. జీలకుంటలో నేలవాలిన మొక్కజొన్న పంటను పరిశీలించి రైతుతో మాట్లాడారు.
వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తు(, Natural Calamity) రైతులను నష్టపరిచిందని అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలతో పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామని ప్రభుత్వానికి నివేదిక అందగానే రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. ‘ నోటికాడికొచ్చిన పంట ఏటిపాలవడం బాధగా ఉందన్నారు. కాయదశలో గాలివానతో రైతులు నష్టపోయారని’ పేర్కొన్నారు. నది తీరప్రాంతాల్లో సాగుచేసిన పంటలను పరిశీలించి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు.