హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధిచెప్పి తడాఖా చూపుతామని నిరుద్యోగ యువకులు హెచ్చరించారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగుల మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత చేసిన నినాదాలు మిన్నంటాయి. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, నిరుద్యోగులను నిండా ముంచి, తమ ప్రయోజనాలు మాత్రమే కాపా డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంపై క్లారిటీ ఇవ్వని సీఎం రేవంత్ ద్వంద్వ వైఖరికి నిరసనగా త్వరలోనే రాష్ట్రవ్యాప్త పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. జీవో 46ను, జీవో 29ని వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతామని హెచ్చరించారు. మహాధర్నాకు బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్‌తోపాటు పలువురు మద్దతు తెలిపారు. నిరుద్యోగ జేఏసీ నేత నీలం వెంకట్, పృథ్వీ, ప్రసన్న హరికృష్ణ, అశోక్, జనార్దన్, మోతీలాల్‌నాయక్, సంజయ్‌నాయక్ సహా నిరుద్యోగులు హాజరయ్యారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని మహాధర్నాలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు స్పష్టంచేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తోపాటు ఉపాధ్యాయ, పోలీస్ ఉద్యోగాల భర్తీకి బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యాయని జేఏసీ నాయకులు తెలిపారు.
‘పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన జీవో 46 రద్దు గురించి బీజేపీ ఏ స్టాండ్ తీసుకున్నది. ఈ జీవో గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు’ అని మహాధర్నాకు వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్సీ అంజిరెడ్డిని నిరుద్యోగులు నిలదీశారు. ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా నిరుద్యోగులు సంతృప్తి చెందలేదు. బీజేపీ స్టాండ్ చెప్పాలంటూ గట్టిగా పట్టుబట్టారు. వేదికపై మాట్లాడుతున్న ఆయనను నిరుద్యోగులంతా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డికి, నిరుద్యోగుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీపై ప్రశ్నలవర్షం కురిపించారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పే క్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టారు. అనంతరం మధ్యలోనే ఎమ్మెల్సీ అంజిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన జాబ్‌క్యాలెండర్ ఏమైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. పోలీస్ ఉద్యోగాలకు అడ్డంకిగా ఉన్న జీవో 46ను వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. గ్రూప్-1కు సంబంధించిన జీవో 29ని రద్దు చేసి నిరుద్యోగులకు మేలు చేయాలని కోరారు. కేసీఆర్ హయాంలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు మాత్రం తామే ఆ ఉద్యోగాలను ఇచ్చినట్టుగా జబ్బలు చరుచుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు చేస్తున్న పోరాటాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తర్వాత నిరుద్యోగుల కోసం ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఒక్కటీ కూడా ఇవ్వలేదని, గత సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లనే తాము ఇచ్చినట్టుగా సీఎం అబద్ధాలు వల్లిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకోసం నిరుద్యోగుల తరఫున బీజేవైఎం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిందని తెలిపారు. కేంద్ర మంత్రి బండిసంజయ్ కూడా ఉద్యోగాల భర్తీ కోసం ధర్నాలు నిర్వహించారని చెప్పా రు. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసేంత వరకు నిరుద్యోగుల తరఫున తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
నిరుద్యోగులు కోరుతున్నది గొంతెమ్మ కోర్కెలేమీ కాదని, వారు అడుగుతున్న ఉద్యోగాలు భర్తీని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ.4,000 భృతిని కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే.. కాంగ్రెస్ పాలకులు కూడా రాజకీయ నిరుద్యోగాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తేల్చి చెప్పారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులకు 64 ఏండ్ల వరకు వయోపరిమితి పెంచుతారంటూ ప్రచారం జరుగుతుందని, దాన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అందాల పోటీలు, సినిమా వేడుకలకు, ఢిల్లీకి వెళ్లడానికి సమయం దొరుకుతుంది కానీ, నిరుద్యోగుల కోసం ప్రత్యేక సమీక్ష పెట్టడానికి, ఉద్యోగాలు భర్తీ చేయడానికి మాత్రం సీఎం రేవంత్‌రెడ్డికి సమయం లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్క ఉద్యోగాన్ని సొంతంగా భర్తీ చేయకున్నా, వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పుకుంటున్నారు. సీఎం స్థాయిలో అబద్ధాలాడటం భావ్యం కాదు. ఉద్యోగాల కోసం ఇందిరాపార్కు ధర్నాకు వేలాదిగా తరలివచ్చాం. వెంటనే జ్యాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రేవంత్‌రెడ్డిని కొడంగల్‌లో ఓడించి తీరుతాం.
– నిరుద్యోగి, నల్లగొండ జిల్లా
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసే ప్రసక్తేలేదు. రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పి తీరుతం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జాబ్ క్యాలెండర్ వేస్తామంటేనే కాంగ్రెస్‌కు ఓట్లేశాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. మేమంతా ఇందరాపార్కు వద్దకు చేరుకుని ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది.
– నిరుద్యోగిని, హుజురాబాద్