Gurukula Recruitment | హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ) : గురుకుల పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా చూస్తామని, వెయిటింగ్ జాబితా అమలును పరిశీలిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాడెత్తేసింది. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి తాజాగా చేసిన ప్రకటనే అందుకు నిదర్శనం. దీంతో గురుకుల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోరు ్డ(ట్రిబ్)కు అప్పగించిన విషయం తెలిసిందే. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీకి కామన్ పేపర్లను పెట్టడం, డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడంతో చాలా పోస్టులు భర్తీకాని దుస్థితి నెలకొన్నది. ఇదే విషయమై అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలను వెల్లడించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు డౌన్మెరిట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు దిగారు. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించడంతో అభ్యర్థుల ఆశలన్నీ గల్లంతయ్యాయి. గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి ట్రిబ్ జారీచేసిన నోటిఫికేషన్లోని పేరా 5(1)లో జీవో 81 ప్రకారం వెయిటింగ్ లిస్టు విధానం లేదు. భర్తీ కాని, అభ్యర్థులు జాయినింగ్ కాని ఖాళీలను క్యారీఫార్వడ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపాల్సి ఉంటుంది.
డీఎల్, జేఎల్, పీజీటీ పోస్టులకు సమాన అర్హతలున్నాయి. చాలా మంది పీజీటీతోపాటు జేఎల్, డీఎల్కూ హాజరయ్యారు. వారిలో చాలా మంది ఒకటికి మించి పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో ఉన్నతస్థాయి పోస్టును ఎంచుకుని మిగిలిన పోస్టులను వదులుకున్నట్టు తెలుస్తున్నది. పీజీటీ పోస్టుల్లోనే 70 శాతం మిగిలిపోనున్నట్టు సమాచారం. గురుకులాల్లోని పోస్టులకు పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అందరూ జేఎల్ పోస్టులకు సైతం హాజరయ్యారు. గురుకులాల్లో పోస్టులు సాధించిన అభ్యర్థులే ఇందులోనూ ఎంపికైనట్లు తెలుస్తున్నది. జేఎల్ పోస్టులకే మొగ్గుచూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో గురుకుల పోస్టుల్లో మరిన్ని ఖాళీలు మిగిలే అవకాశముంది.
డౌన్మెరిట్ ఆపరేట్ చేసి పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా చూసే అవకాశమున్నా కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుత నోటిఫికేషన్లో మిగిలిన పోస్టులన్నీ క్యారీ ఫార్వార్డ్ చేయాలని చూస్తున్నది. ఆ పోస్టులతోపాటు ఇప్పటికే సొసైటీల వారీగా గతంలోనే మంజూరైన పోస్టులన్నింటినీ కలిపి మరో నోటిఫికేషన్ ఇచ్చి తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 81ను పక్కన పెట్టి 2016లో వన్ టైం రిలాక్సేషన్ కింద డౌన్మెరిట్ ఆపరేట్ చేసి పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుత పోస్టుల్లోనూ బ్యాక్లాగ్ లేకుండా డౌన్మెరిట్ కల్పించే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.