జవహర్‌నగర్, నవంబర్ 16: పేదల ఇండ్లను కూల్చే సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారని, హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను నడిరోడ్డున పడేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పిచ్చిపిచ్చి పనులు చేసే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని, ఈ సర్కారుకు పేదల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. రోడ్డు బాధితులకు అండగా ఉంటామని, అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. ‘బాలాజీనగర్‌లో ఉండే భూములు పుక్కడివి అనుకోవద్దు.. రెక్కల కష్టం మీద బతికే పేదలు రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కున్నరు.. రోడ్డు విస్తరణతో నిర్దాక్షిణ్యంగా పేదల ఇండ్లను కూల్చుతామంటే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని చెన్నాపురం నుంచి మల్లికార్జున్‌నగర్ కమాన్ వరకు చేస్తున్న రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న బాధితులను శనివారం ఆయన పరామర్శించి అండగా ఉంటామని చెప్పారు. చెన్నాపురం నుంచి మల్లికార్జున్‌నగర్ కమాన్ వరకు 100 ఫీట్లు వద్దని 60 ఫీట్ల రోడ్డు చాలని బీజేఆర్నగర్వాసులు వేడుకుంటున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటుచూసినా పేదల ఇండ్లే కనిపిస్తున్నాయని, కుటుంబాలకు నిడనిచ్చేదిపోయి… ఉన్న నీడను కూడా లేకుండా చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎల్లకాలం నిలువదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పేదల జోలికి వస్తే ఊరుకోం.. పేదల ప్రక్షాన పోరాడుతాం.. న్యాయం జరిగేవరకు అండగా నిలుస్తాం’ అని స్పష్టంచేశారు. బాలాజీనగర్‌లో కుట్టుమిషన్ కుట్టుకునే, ఇండ్లల్లో పనిచేసే పేద ఆడబిడ్డలే ఉన్నారని, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారిపై ప్రభుత్వం ప్రతాపం చూపించడం మంచి పద్ధతి కాదని, రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల చెమటమీద బతికే అధికారులు అత్యుత్యాహం ప్రదర్శిస్తే చూస్తూ ఉండబోమని, ఎల్ఆర్ఎస్ కింద డబ్బులు కట్టిన వాళ్లు కూడా ఉన్నారని, అర్ధంతరంగా ఇండ్లు కూలగొడుతామంటే ఎలా? అని ప్రశ్నించారు.
హనుమకొండ, నవంబర్ 16 : సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. శనివారం ఆయన హనుమకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలతో కలిసి సీఎం రేవంత్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడని విమర్శించారు. లగచర్ల గిరిజనులపై ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. లంబాడా, గిరిజన బిడ్డలతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. మహిళలని చూడకుండా కేసులు పెట్టించడం సిగ్గుచేటని అన్నారు. ‘శంకర్‌నాయక్ ఒకడే వస్తాడు.. నువ్వా.. నేనా చూసుకుందాం.. నీకు దమ్ముంటే గన్‌మెన్‌ను పక్కకు పెట్టి గన్‌పార్కుకు రా’ అంటూ సవాల్ విసిరారు. ఈ నెల 19లోగా గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.