హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించేందుకు దారితీసిందని తెలుస్తున్నది. బీసీ సంక్షేమ శాఖలో ఇదే చర్చ జోరుగా కొనసాగుతున్నది. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సకాలంలో స్పందించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, నిర్ణయం తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే పథకానికి బ్రేకులు పడ్డాయని చర్చించుకుంటున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రభుత్వం తిరిగి నెపాన్ని అధికారులపై మోపేందుకు సిద్ధమవడంపై బీసీ సంక్షేమ శాఖలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. మంత్రి తీరుపై కూడా గుర్రుమంటున్నారు.
నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ ఆడబిడ్డల కల్యాణానికి ఆర్థిక సాయం అందజేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో ఈ పథకాన్ని తొలుత ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. తొలుత పథకం కింద ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల కల్యాణానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.51 వేలు అందించింది. ఆ తరువాత 2016 నుంచి కల్యాణలక్ష్మిని అన్నివర్గాలకు విస్త్తరించింది. మైనారిటీల కోసం షాదీముబారక్ స్కీమ్‌ను సైతం తీసుకొచ్చింది. ఆర్థిక సాయాన్ని సైతం రూ.1,00,016 పెంచింది. పథకాల అమలుకు బీసీ సంక్షేమ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించింది. నాటి నుంచి ఆ శాఖ ఆధ్వర్యంలో పథకం అమలు కొనసాగుతున్నది.

కల్యాణలక్ష్మి పథకానికి చట్టబద్ధత లేదని జూన్‌లో ఒకరు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ జూన్ 27న విచారణకు రాగా, కోర్టు కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. కౌంటర్ దాఖలు విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. జూలై 27వ తేదీ వరకు కూడా పిటిషన్ సమాచారాన్ని సంబంధిత శాఖలకు ఇవ్వని దుస్థితి నెలకొన్నది. చివరి నిమిషంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే బీసీ సంక్షేమ శాఖతోపాటు ఇతర మైనారిటీ, ఎస్సీ, ఆర్థిక తదితర మొత్తంగా ఆరు శాఖలకు ప్రభుత్వం ఆగమేఘాల మీద సమాచారం అందించింది. ఇదిలా ఉంటే, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రస్తుత కమిషనర్ సైతం సదరు పిటిషన్‌పై పట్టించుకున్న దాఖలాలేదు. ఆగస్టు 3న విచారణ జరుగాల్సి ఉండగా, ఆ రోజున బెంచ్ మీదికి రాలేదు. తదుపరి 12వ తేదీన విచారణకు రాగా, అప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు.
మరో గడువు కోరగా, సర్కార్ తీరును తప్పుబడుతూ కోర్టు స్టే విధించినట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తంలో ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖకు రెగ్యులర్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోవడం, ఈ పరిస్థితికి దారితీసిందని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతోనే కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. హైకోర్టు స్టే అనంతరం రాజకీయ విమర్శలు రావడంతో ఆగమేఘాల మీద కిందిస్థాయి సిబ్బందిని పరుగులు పెట్టించి, 2014లో క్యాబినెట్ ఆమోదం ప్రతులు, గత ఉత్తర్వుల కాపీలను వెలికితీయడంతోపాటు వెకెట్ పిటిషన్‌కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఉదాసీనత, ఉన్నతాధికారుల పట్టింపులేనితనమే స్పష్టంగా కనబడుతున్నది. ప్రభుత్వం తన వైఫల్యాన్ని, ఉన్నతాధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు కిందిస్థాయి ఉద్యోగులపై నెపం మోపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం విచారణకు ఆదేశించడం అందులో భాగమేనని సంక్షేమభవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కల్యాణలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే విధించడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారుల లోపమా? న్యాయపరంగా ప్రభుత్వ వ్యవహారాలు చూసే వారి లోపమా? అనే అంశంపై విచారణ చేపట్టడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పథకాన్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు గ్రీన్‌చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నదని తెలిపారు. పథకంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై డివిజనల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పొరపాట్ల వల్లనే సమస్య తలెత్తిందని ఆరోపించారు. కౌంటర్ ఫైల్ చేయడంలో అధికారుల లోపమా? ప్రభుత్వ న్యాయపరమైన అంశాలు చూసే వారి లోప మా? అనే దానిపై విచారణకు ఆదేశించామని, బా ధ్యులపై త్వరలో చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, పథకాల కింద ఇప్పటివరకు రూ.16,375.87 కోట్లకుపైగా ఖర్చు చేయగా, 16,78,347 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందని వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ ధర్నాలు చేస్తున్నదని ఆరోపించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు ఎదురుచూడకుండా కోర్టులో స్టే తొలగించడానికి ముందుకు వెళ్తున్నామని తెలిపారు.