CM KCR | దేశంలో 2024 ఎన్నికల్లో రాబోయే తెలంగాణ ప్రభుత్వమేనని, ఆ తర్వాత తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బాధతో అయినా సరే బాధతో అందరూ అంగీకరించక తప్పదు. 70 సంవత్సరాల కిందట రాజ్యాంగం అమలైనా అనేక పార్టీలు గెలుపొందడం, ఓడడం ప్రభుత్వాల్లో మార్పులు జరిగాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరుపేదలు ఎవరంటే దళితుల అనే మాట ఉండడం మనందరికీ సిగ్గుచేటు. ఈ పరిస్థితి మారాలి. పార్టీలు ఓడిపోవడం, వేరే పార్టీలు గెలువడం కాదు.. ప్రజలు గెలిచేటటువంటి రాజకీయం దేశంలో రావాలి. దాని కోసం దళిత మేధావివర్గం ఆలోచన చేయాలి’ అని పిలుపునిచ్చారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి ముందు ఇక్కడ వేరే పార్టీ రాజ్యం చేసింది. పది సంవత్సరాల కాలంలో దళితుల అభివృద్ధి కోసం చేసిన ఖర్చు రూ.16వేలకోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేసిన ఖర్చు చేసిన డబ్బు రూ.1.25లక్షల కోట్లు. ఇది కంప్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ జనరల్ ఇచ్చిన అకౌంట్ల నిర్ధారణ. ఈ సమాచారం ప్రభుత్వ వెబ్సైట్లలో ఉంటుంది. ఎవరైనా దీన్ని పోల్చుకొని చూసుకోవచ్చు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా గొప్ప, అద్భుతమైన కార్యక్రమం దళితబంధు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. అనేక పార్టీలు కోలాహాలు, గొడవలు, గందరగోళాలు ఎన్నో చెబుతుంటారు. కానీ, వాస్తవ దృక్పథం వైపు దళితబిడ్డలందరు కొనసాగించేలా.. మేధావివర్గం కొనసాగించాలి’ అన్నారు.
‘దేశంలో రాబోయే ప్రభుత్వం మనదే అని చెబుతున్న. తెలంగాణ దళితబంధు తరహాలో దేశంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అమలు చేస్తాం. నేను ఈ శుభసందర్భంలో ప్రకటిస్తున్నా. ఖచ్చితంగా దేశంలో ప్రతి సంవత్సరం 25లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అమలు చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో ఈ సదుపాయం అందుతుందని నేను మనవి చేస్తున్నా. మనందరం కూడా ముందుకెళ్దాం. అంబేద్కర్ రిలవెన్స్ ఇంకా ఉంది. ఆయన కలలు ఇంకా నెరవేరలేదు. ఆయన కలలు సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎవరైనా నిజమైన భక్తితో పేద ప్రజలను ఆశీర్వదించేందుకు ముందుకు వెళ్తున్నామో వారికే మీ బలం అందాలి. మనం చీలిపోతే వారికే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం మనదే. రాష్ట్రంలో 50వేల మందికి దళితబంధు సదుపాయం అందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25లక్షల మందికి సదుపాయం అందబోతున్నది. దీన్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేయాలని అధికారులను కోరుతున్నా’నన్నారు.