హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు నాలుగు నెలల గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. రైతుల ఆత్మహత్యలపై రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశామని, అవి ఇచ్చిన నివేదిక మేరకు పరిహారం చెల్లిస్తామని తెలిపింది. ప్రభుత్వ న్యాయవాది టీ శ్రీకాంత్‌రెడ్డి మం గళవారం వాదనలు వినిపిస్తూ, అన్ని జిల్లాల్లో కమిటీలు వేశామన్నారు.
రైతుల ఆత్మహత్యలపై 28 ప్రతిపాదనలను కమిటీలు నివేదించాయని చెప్పారు. గడువు ఇస్తే కమిటీల సిఫారసులకు అనుగుణంగా రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. నాలుగు నెలల గడువు కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆమోదించింది.