యాదగిరిగుట్ట, డిసెంబర్16: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణీ నవీన్‌కుమార్‌ను గ్రామ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ నిచ్చారు. వాసాలమర్రిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పడిన ఓటును అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే అధికారులు చోరీకి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అక్రమమని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని స్పష్టంచేశారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ను మాజీ ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, వాసాలమర్రి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పలుగుల ఉమారాణీ నవీన్‌కుమార్‌తో కలిసి ఎన్నికల్లో జరిగిన అన్యాయాన్ని వివరించారు. గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బలపర్చిన సర్పంచు అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా, డ్రా పద్ధ్దతిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజేతగా అధికారులు ప్రకటించారని తెలిపారు.
ఆ మరుసటి రోజే కౌంటింగ్ జరిగిన ప్రదేశంలో ఏ038321 నంబర్ గల బ్యాలట్ పేపర్ స్థానికులకు కనిపించిందని పేర్కొన్నారు. పేపర్ వెనుక భాగంలో పోలింగ్ అధికారి సంతకంతో పాటు 16/2 రౌండ్ సీల్ కూడా ఉన్నదని తెలిపారు. దానిపై బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణికి కేటాయించిన కత్తెర గుర్తుపైనే ఓటు వేసినట్టు స్పష్టంగా ఉన్నదని పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఉమారాణిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధికారులతో కుమ్మకై కుట్ర చేశారని ఆరోపించారు. వాసాలమర్రిలో కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకి పాల్పడ్డారని వివరించారు. ఈ అంశాలను క్షుణ్ణంగా విన్న కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు స్పష్టంగా ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి, అన్యాయంగా ఫలితా న్ని మార్చే ప్రయత్నాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసాలమర్రి ప్రజలకు న్యాయం జరగాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని, ఈ అన్యాయంపై న్యాయపోరాటం చేసేందుకు బీఆర్ఎస్ ఉంటుందని భరోసా ఇచ్చారు.