బల్మూరు, మే 24 : ఆరు నూరైనా ఉమమాహేశ్వర ప్రాజెక్ట్ను నిర్మించి కృష్ణా నీటిని పారిచ్చి రైతుల పాదాలు కడుగుతామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరులో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో భూసేకరణపై ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ అరుణారెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు.
అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టేజ్-1 ద్వారా రైతుల నుంచి భూసేకరణ కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో కొన్ని గ్రామాల రైతులు, ప్రజలకు నష్టం జరగడం ఖాయమని అన్నారు. కానీ ఐదు మండలాల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు అనంతవరం, బల్మూరులో ఒక్క ఇల్లు కూడా పోకుండా గ్రామాలకు 350, 370 మీటర్లు దూరంగా డిజైన్ మార్పు చేసినట్టు చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు అడ్డుపడి అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని సూచించారు.