CM KCR | మిషన్ మోడ్‌లో పేదలకు ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సౌభాగ్యలక్ష్మి, గృహలక్ష్మి పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంకా రాష్ట్రం ముందుకుపోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఇంకా చిక్కపడాలంటే అంటే తప్పకుండా మీ ఆశీస్సులు అవసరమవుతాయి. అందుకే ఓటు అంటే ఆషామాషీగా వేయొద్దు. చాలా ప్రోగ్రామ్‌లు ప్రకటించాం. ఆడబిడ్డల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం తీసుకువచ్చా. వారికి ఆర్థిక సాయం అందిస్తాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రకటించాం. వ్యవసాయం, కరెంటు, మంచినీళ్లు, రోడ్లు బాగు చేసుకుంటూ వచ్చాం. పేదలకు ఇండ్లు కట్టాలి పేదలకు నాకు తెలుసు. తప్పకుండా వచ్చే సంవత్సరంలో మిషన్ మోడ్ తీసుకొని ముమ్మరంగా ఇండ్లు కూడా కట్టిస్తాం. జాగలు లేని వారికి జాగలు ఇస్తాం. జాగలు ఉన్న వారికి గృహలక్ష్మి కింద మంజూరు చేస్తాం. గృహాలు నిర్మించుకుందాం. ఒకటేరోజు అన్నీ కావు కదా? ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాం. కనీస అవసరం కొన్ని ఇప్పుడు తీరినయ్. రేపు ఇండ్ల నిర్మాణం కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం’ అన్నారు.
‘కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. ‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వొందుకు పుట్టినవ్ రా వంకర అంటే.. సక్కగున్నో ఎక్కిరించడానికి అని మాట్లాడిండట’. పదేళ్లగోలె అన్ని చేసుకుంటే వస్తే.. తద్దినం ఉన్నది అని భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో రోజు ఇట్లనే జరగాలి అన్నడట’ ఇంతకన్నా అధ్వాన్నం ఉంటదా ? మళ్లీ వీఆర్వోలను తెస్తాం.. పైరవీకారులను తెస్తం అంటున్నారు ఇది పద్ధతా? బీఆర్ఎస్ కన్నా మంచిగా చేస్తామని చెప్పాలి గానీ.. ఉన్నదంతా ఊడగొడుతం.. ‘ఎల్లమ్మ ఊడగొడితే మల్లమ్మ మాయం చేసిందన్నట్టు’ ధరణిని తీసివేస్తాం అంటే దాని అర్థమేంటీ ? కాంగ్రెస్ వస్తే తప్పకుండా దళారీ రాజ్యం వస్తది. పైరవీకారులు చెలరేగుతరు. ఇవాళ నిశ్చితంగున్నరు రైతులు. ఏ ఆఫీసుకు వెళ్లకుండా ధరణితో పైసా తరుగుపోకుండా సాయం అందుతున్నది. అదే రేపు ఎలా రావాలి? మునిగిపోతం. అందుకే జాగ్రత్త అని మనవి చేస్తున్నా’ అని సీఎం అన్నారు.
‘పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 52 తండాలను గ్రామ పంచాయతీలు చేయించారు. ఆ తండాల్లో లంబాడా బిడ్డలే రాజ్యమేలుతున్నరు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుకున్నాం. విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కాంగ్రెస్ ఉన్ననాడు మీ మొఖం కూడా చూడలేదు. ఓటు బ్యాంకుగా వాడుకున్నరు తప్ప ఎన్నడూ ఏం చేయలేదు. దళితబిడ్డలను అభివృద్ధి చేయాలని దళితబంధు తీసుకువచ్చాం. అందరికీ అందేదాక బీఆర్ఎస్ పని చేస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్క వర్గాన్ని, కులాన్ని అందరినీ వెంట తీసుకొనిపోతాం. గొర్రె పిల్లలను పెంచడానికి గొర్రెలను పెంచాం. ఎవరి వృత్తి వారికి రావాలని.. ముదిరాజ్‌లు, బెస్తలకు ఉపాధి కల్పించాలని వందకోట్లు ఖర్చుపెట్టి చేపలు పెంచుతున్నాం. 33వేలకోట్ల చేపలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నయ్. మత్స్యకారులు, ముదిరాజ్‌లకు కడుపునిండా పని జరుగుతున్నది. కులం, మతం లేకుండా అందరిని కలుపుకొని పోతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం’ అన్నారు.
‘మహేశ్ రెడ్డిని పెద్ద మెజారిటీతో దీవించాలి. ఆయన నా మిత్రుడి కొడుకు. హరీశ్వర్‌రెడ్డి నేను కలిసి పని చేశాం. 30 ఏళ్లు కలిసి పని చేశాం. అదేవిధంగా ఈ రోజు మహేశ్‌రెడ్డి హరీశ్వర్‌రెడ్డి కొడుకంటే.. నాకూ కొడుకు లెక్కనే. హరీశ్వర్‌రెడ్డి మండలాలు కావాలంటే.. ఎనుకముందే చేయలేదు. రెండు మండలాలు వెంటనే చేశాం. పాలిటెక్నికల్, ఐటీఐ కాలేజీ, రెండు కొత్త మండలాలు కావాలని కోరాడు. వందశాతం వాటిని ఎన్నికల తర్వాత నెలలోపు వచ్చాక ఆ పనులు చేసే బాధ్యత నాది. బ్రహ్మాండంగా మెజారిటీ గెలిపించండి.. ఒక రోజు పరిగికి వచ్చి.. కూసోని ఏం సమస్యలున్నడో తెలుసుకొని.. ఇక్కడే ఉండి చేయించే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా’నన్నారు.