హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు మొదటిరోజే స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం వ్యవహరించడం లేదని, బీసీలను మోసగిస్తున్నదని మొదటినుంచీ బీసీ సంఘాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్తున్నదే నిజమని తేలిపోయింది. జీవోతో బీసీ రిజర్వేషన్ అమలుకాదని, బీసీలను మోసం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి జీవో 9 తీసుకొచ్చారని ఆరోపించారు. వారు చెప్పినట్టుగానే జీవో9పై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. గత నెల 29న ఇచ్చిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీచేసింది. షెడ్యూల్లో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ఎస్ఈసీ వివరాలు వెల్లడించింది.
తొలి విడత ఎన్నికల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకొనే ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం పదిన్నర గంటలకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు జారీచేశారు. ఆయా పరిషత్‌ల పరిధిలోని ఓటర్ల జాబితాను కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ కార్యాలయాల నోటీసు బోర్డుల వద్ద ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,963 ఎంపీటీసీలకు, 292 జడ్పీటీసీల స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. తొలిదశ 292 జడ్పీటీసీ స్థానాలకు 16, 2,963 ఎంపీటీసీ స్థానాలకు 103 నామినేషన్లు దాఖలైనట్టు టీజీ ఎస్ఈసీ ప్రకటించింది. జడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి 10, సీపీఎం నుంచి రెండు, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు, ఇతర రాష్ర్టాల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్ దాఖలయ్యాయి. అలాగే ఎంపీటీసీ స్థానాల కోసం కాంగ్రెస్ నుంచి 60, బీఆర్ఎస్ నుంచి 18, స్వతంత్రులు 12 మంది, సీపీఎం నుంచి 8, బీజేపీ నుంచి 4, ఇతర రాష్ర్టాల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్టు ప్రకటించింది. షెడ్యూల్‌ను రద్దు చేయడంతో తొలి రోజు దాఖలు చేసిన నామినేషన్లు చెల్లవు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పిటిషన్లపై గురువారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత హైకోర్టు విచారణ ప్రారంభించి 4.30 గంటల సమయంలో జీవో 9పై స్టే విధించింది. హైకోర్టు ఆదేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టయింది. హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్ పదవుల ఎన్నికల కోసం గత నెల 29న జారీ చేసిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ నంబర్ జీ-761/1ను తదుపరి నోటిఫికేషన్ వచ్చేవరకు తక్షణమే నిలిపివేస్తున్నట్టు ఎస్ఈసీ ప్రకటించింది. నాటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అన్ని ఇతర ప్రక్రియలు, చర్యలు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు తక్షణమే ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.