KCR | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. సుమారు ౩ గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లావాళ్లు కృష్ణాబేసినే..రంగారెడ్డి జిల్లాలో పడే ప్రతీ వర్షం చుక్క కృష్ణానదిదకే పోతది. నల్లగొండ జిల్లాలో కూడా ప్రతీ వర్షం చుక్క కృష్ణాబేసిన్కే పోతది.. పాలమూరు.. ఈ మూడు జిల్లాలు కూడా వంద శాతం కృష్ణాబేసిన్‌లో ఉన్నాయన్నారు.
వాటాల విషయంలో మనం సమైక్య రాష్ట్రమున్నప్పుడు జరిగిన మోసం నుంచి బయటకు రావాలంటే. మనం రాష్ట్రం ఏర్పడ్డాక కొట్లాడాలే.. మన వాటా మనం సాధించాలే. కృష్ణా జలాలా పున: పంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలే. అని స్ట్రాటజీ పెట్టి కొట్లాడినం. దేవుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ ప్రభుత్వం మా స్ట్రాటజీ అని కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వాల మార్పిడులుంటాయి…కానీ
రాజకీయాల్లో గెలుపులు, ఓటములుండటం సహజం. ప్రభుత్వాల మార్పిడులుంటాయి. కానీ ఎంత సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎవరొచ్చినా ఒక ప్రాజెక్ట్ అంటే రాష్ట్ర ప్రయోజనం కదా..?
మా ప్రభుత్వం పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు. మరి దాన్ని ఎందుకు వదలిపెట్టిర్రో.. దాని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందో..? ఇంత దారుణమేంది,..రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. మేం గమనిస్తున్నం. మధ్యలో కేంద్రప్రభుత్వం బీజేపీతో ఓ తమాషా… మొదటి నుంచి తెలంగాణకో శని అయింది అది.
కేంద్ర ప్రభుత్వం ప్రతీ దాన్ని వ్యతిరేకించడమే. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడం.. ఆయన మాటలు పట్టుకుని ప్రతీ దాన్ని అడ్డంగా వ్యతిరేకించడమే. మేం ఉన్నన్ని రోజులు బాగా కొట్లాడినం.. అనేకమైన పోరాటాలు చేసినం. పోరాటాలతో ఎప్పటికపుడు అనుమతులు సాధించుకున్నం. ప్రాజెక్ట్‌కు లైఫ్‌లైన్ అయినట్వంటి ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ నుంచి అనుమతులు వచ్చేసినయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే ఇక. అన్ని వచ్చిన తర్వాత కేంద్రప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరముంది కదా..దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతది. అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి..ఆయన మాటలు పట్టుకుని డీపీఆర్‌ను వాపస్ పంపించిన్రు. మేం ఉన్నన్ని రోజులు డీపీఆర్ వాపస్ రాలే. మేమింకా తిరిగి అనుమతులు తెచ్చినం. డీపీఆర్ వాపస్ వస్తే రాష్ట్రప్రభుత్వం భూమి, ఆకాశాన్ని ఒకటి చేయాలే. ఎంత లొల్లి చేయాలే..? అని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకపోవాలే.. మేం వడ్లు కొనకపోతే ఢిల్లీకి పోయి ధర్నా చేసినమని కేసీఆర్ గుర్తు చేశారు.
మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతేనే యావత్ మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినమని కేసీఆర్ అన్నరు. ఢిల్లీలో 80 లక్షల టన్నులు మేం తీసుకుంటం అనే ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినం. ఎఫ్‌సీఐతో వడ్లు కొనిపించినం. వడ్లు కొనకపోతేనే మేమంత హడావుడి చేసి పోయినం. కానీ ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్ వాపస్ పంపిస్తే వీళ్లు చడీచప్పుడు లేదన్నారు.
ఏమేం ఇయ్యాలే అనే దానికి ఓ పద్దతి, చట్టం ఉంది..
దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలుంటాయి. నీళ్లెన్ని రావాలే.. ఫలానా ఫలానా ఎంత రావాలే..? అని ప్రాదిపదికన కొన్ని సాధారణంగానే సంక్రమిస్తయి. అది ఎస్ఆర్సీ యాక్ట్. భారతదేశంలో ముందుగా ఉన్నయి 14 రాష్ట్రాలే. మిగిలిన 15 రాష్ట్రాలు తర్వాత ఏర్పడ్డవే. ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వాటికి ఏమేం ఇయ్యాలే అనే దానికి ఓ పద్దతి, చట్టం ఉంది. వాటన్నింటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇయ్యలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినం..
నీళ్లు ఎన్ని రావాలే అనే విషయంలో మొదట అవకాశం ఏ రాష్ట్రాలైతే విడిపోయినయో ఆ రాష్ట్రాలకు మీరు మ్యూచువల్ ఒప్పందం చేసుకోండని ఇస్తారు. ఇక్కడ అది పొసిగే కార్యక్రమం కాదు. కాబట్టి మేం ఏడాదిలోపు పరిష్కారమైతే రెండు రాష్ట్రాలు చేసుకోవాలి.. లేదంటే కేంద్రప్రభుత్వమే కూర్చొని ఆర్బిట్రేషన్ ద్వారా చేయాలి. చేయనప్పుడు సుప్రీంకోర్టుకు పోవాలి.
మేం ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినం. సెక్షన్ ౩ వెయ్యండి.. మాకు కృష్ణా జలాల పున:పంపిణీ చేయాండి అని అప్పీల్ చేస్తే వాళ్లు దాన్ని లెక్కచేయలేదు. మేం సుప్రీంకోర్టుకు పోతే కేంద్రప్రభుత్వంపై కోపానికి వచ్చింది. పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్లకు రావాల్సినవన్నీ రావాలి కదా. మరి ఇది కూడా వాళ్లకేదో తేల్చండి మీరు. తేలుస్తరా.. లేదా అంటే అప్పుడామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేను ఢిల్లీ పోయినప్పుడు ఆయన నన్ను రిక్వెస్ట్ చేసిండు. మాకు కూడా ఇబ్బంది అవుతుంది.. మీరు సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకోండి. మేం సెక్షన్ ౩ వేస్తమండి అన్నరు. అప్పటికే రెండు మూడేళ్లు గడిచి ఆలస్యమవుతూనే ఉందన్నారు.
90 టీఎంసీలు మావే..
నేను అక్కడికి పోయినప్పుడల్లా అడుగుతున్నా. మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రికి లేఖలు ఇచ్చినం. ఫైనల్‌గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ఎట్లాగో తప్పటట్టు లేదని మీరు విత్ డ్రా చేసుకోండి.. మేం ఇచ్చేస్తమన్నారు. ఆ తర్వాత విత్ డ్రా చేసుకొని లెటర్ పెట్టుమంటే వారికి (సెక్షన్ ౩ వేయడానికి) పెట్టినం. అది ప్రాసెస్‌లో ఉంది.
చివరికి సెక్షన్ ౩ వేసిన్రు. దానికి బ్రిజేశ్ ట్రిబ్యునల్ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మాకేం రావాలే.. మీకేం రావాలే అని వాదనలు జరుగుతున్నయి. తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాలు మాట్లాడుతున్నాయి. అక్కడే తేలుతది.. మా ఉద్దేశమంది.. 90 టీఎంసీలు మావే.. నికరం తేలుతది. మాకెవరు ఇచ్చేదేమి లేదు.. అడుక్కునేదేమి లేదన్నారు.
ఇంకో 60-70 టీఎంసీలు కావాలంటే..
అదనంగా ఇంకో 60-70 టీఎంసీలు కావాలంటే ఎట్లా అంటే ట్రిబ్యునల్ మనకొచ్చే అధిక వాటా ఏదైతే ఉంటదో బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఏం చేసిండు. వచ్చిన తర్వాత ఆయనొకటి చేసిండు.. అంతకు ముందు చట్టం ఏముంటుండే.. 75 శాతం డిపెండబులిటీ మీదనే నదుల నీళ్లు కేటాయింపు జరుగాలే. మనకు కృష్ణా జలాలు ఇచ్చినప్పుడు అట్లే ఇచ్చిన్రు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత 75 శాతం ఓల్డ్.. సర్ప్లస్ ఇయర్స్‌లో చాలా వర్షాలు పడుతున్నయి. కావాల్సినన్నీ నీళ్లు వృథాగా పోతున్నయి. అట్లెందుకు కేటాయింపులు చేసుకుందాం.. 65 శాతమే డిపెండబులిటీ పెట్టుకుందామన్నారు.
దాని ద్వారా మనకు కృష్ణానదిలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వచ్చిన ఒరిజినల్ కేటాయింపు 811టీఎంసీలే. కానీ తదనంతరం బ్రిజేశ్ వచ్చిన తర్వాత అది దాదాపు 1005కు పోయింది. ఆ 10 శాతం యాడ్ చేసే వరకు ఇంకో 195 టీఎంసీలు పెరిగింది. పెరిగితే దాంట్ల మనకు కూడా ఆటోమేటిక్‌గా వాటా వస్తది. ఇప్పుడు తేలుతది అది.. మేం ఆశ పడ్డదేంటంటే..ఒరిజినల్‌గా పెట్టుకున్న ఈ 90 టీఎంసీ.. ఇప్పుడు మనకు అదనంగా వచ్చేది కలిస్తే దాదాపు 170 దాకా తీసుకుపోవచ్చు. కంఫర్టబుల్‌గా తాగునీటికి, ఇతర అవసరాలకు గానీ బాధలేకుండా బ్రహ్మాండంగా ఉంటమన్నారు కేసీఆర్.