రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎన్నో చేయాల్సి వస్తుంది. భాగస్వామి ఆసక్తులకు అనుగుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా.. నచ్చినట్టుగా నటించాల్సి వస్తుంది. ఇలా అప్పుడప్పుడూ జరగడం కామన్! కానీ, అదే అలవాటుగా మారితే మాత్రం.. డేంజర్!
భాగస్వామిని మెప్పించడానికో, గొడవ వద్దనుకునో.. కొందరు కొన్నిసార్లు రాజీపడుతుంటారు. ఈ క్రమంలో కొద్దిగా నటిస్తుంటారు కూడా! ఎప్పుడో ఓసారి ఇలా చేస్తే ఫర్వాలేదు. కానీ, నిత్యం ఇలా నటిస్తూ పోతుంటే.. మానసిక ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివారు భాగస్వామితో సమయం గడపడానికే భయపడుతుంటారు. వారితో ఉంటే ప్రశాంతతకు బదులుగా.. ఏదో పెద్దపని చేసినట్లుగా ఫీలవుతుంటారు. మీకూ అలాగే అనిపిస్తుంటే.. మీరు మీలా ఉండటం లేదని అర్థం. జీవితంలో ఏదో ముఖ్యమైనది కోల్పోతున్నారని భావం.
అయితే, భాగస్వామి ముందు నటించడానికి కారణాలు అనేకం. తమలోని లోపాలు, బలహీనతల్ని చూస్తే.. భాగస్వామి తమను తక్కువగా అంచనా వేస్తారని కొందరు భయపడుతుంటారు. దాంతో, వాటిని కప్పిపుచ్చుకోవడానికి నటిస్తూ ఉంటారు. మరికొందరి మనసులో బాధగా ఉన్నా.. భాగస్వామి సంతోషం కోసం వారిముందు నవ్వుతూ ఉంటారు.
ఇంకొందరికి ఏదైనా విషయం నచ్చకపోయినా, కేవలం గొడవ అవుతుందనే కారణంతోనే ‘సరే!’ అని చెబుతారు. పాత రిలేషన్షిప్స్లో నిజాయతీగా ఉన్నందుకు ఎదురైన చేదు అనుభవాలు కూడా.. ఇలా నటించడానికి కారణం అవుతాయి. కానీ, నిజమైన బంధం అనేది నమ్మకం, నిజాయతీ మీదే ఆధారపడి ఉంటుందన్న సంగతి గుర్తించాలి. కాబట్టి, భాగస్వామి దగ్గర నటించడాన్ని తగ్గించుకోవాలి. చిన్నచిన్న విషయాల్లో మీ నిజమైన అభిప్రాయాన్ని చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. భాగస్వామితో ఓపెన్‌గా మాట్లాడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సంపూర్ణంగా స్వీకరించుకోవాలి. అప్పుడే.. మీ భాగస్వామి అయినా, ఇతరులైనా.. మిమ్మల్ని అలాగే గౌరవిస్తారు. ప్రేమిస్తారు.