మండే ఎండల్లో జుట్టును సంరక్షించుకోవడం చాలాకష్టం. అదే సమయంలో.. తలను చల్లగా ఉంచుకోవడమూ ముఖ్యమే! ఇందుకోసం వేలకువేలు ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. మీ ఇంట్లోనే దొరికే ఓ మూడు పదార్థాలతో.. ఈ రెండు సమస్యలకూ చెక్ పెట్టొచ్చు. కాస్తంత పెరుగు, కొద్దిగా కలబంద గుజ్జుతోపాటు గుప్పెడు మందార రేకులు ఉంటేచాలు. అద్భుతమైన హెయిర్ప్యాక్ను సిద్ధం చేసుకోవచ్చు. ఈ మూడు పదార్థాలు జుట్టు ఆరోగ్యంలో కీలకంగా పనిచేస్తాయి.
వెంట్రుకలను మృదువుగా మార్చడంతోపాటు కుదుళ్లనూ బలోపేతం చేస్తాయి. ఒక అరకప్పు తాజా పెరుగులో మూడు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, మందార పువ్వు రెమ్మలు ఓ గుప్పెడు వేసుకోవాలి. ఈ మూడింటినీ మిక్సీజార్‌లో వేసి.. మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి. ముందుగా జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకుని.. ఈ పేస్ట్‌ను కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి.
30 నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత తక్కువ గాఢత కలిగిన షాంపూ, గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. జుట్టుకు కలబంద మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది, తలలో దురదను తగ్గిస్తుంది. ఇక పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్.. చుండ్రును సమర్థంగా నివారిస్తుంది. జుట్టుకు కండిషనర్‌లా పనిచేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్‌ను రెగ్యులర్‌గా వేసుకుంటే.. జుట్టు రాలడం తగ్గడంతోపాటు జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. మాడుకు చల్లదనం చేకూరుతుంది.