నల్లగొండ ప్రతినిధి, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కీలకపాత్ర పోషించారని, రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషి అమోఘమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొనియాడారు. ఉద్యమకాలంలో కేసీఆర్‌తోపాటు జయశంకర్, కేశవరావు, కోదండరాం తదితరులంతా కలిసి నడిచారంటూ వారందరికీ నాయకత్వం వహించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అందుకే ప్రజలు కేసీఆర్‌కు పదేండ్లు అధికారం కూడా ఇచ్చినట్టు తెలిపారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
రాష్ట్ర సాధన కల సాకారం కావడంలో కేసీఆర్ పాత్ర, ఆయన చేసిన కృషి అభినందనీయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ర్టాల పట్ల వివక్ష చూపుతున్నదని, ఇక్కడ తక్షణమే నియోజకవర్గాల పునర్విభజ న జరపాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో దేశంలో ఉత్తర, దక్షిణాది రాష్ర్టాల మధ్య విభేదాలకు ఆస్కారం ఏర్పడుతుందని, ఇది సరైంది కాదని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రెండు రాష్ర్టాల బీజేపీ నేతలదేనని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.
రాష్ర్టాలవారీగా ఉన్న కులాల మధ్య తేడాలపై మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉన్నదని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొ టోకాల్స్ ఉల్లంఘనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉన్నదని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వను మరో 2మీటర్లు వెడల్పు చేసి లైనింగ్ పనులు చేపడితే ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.