బాల్కొండ/వేల్పూర్, సెప్టెంబర్ 10: ఎద్దు, ఎవుసం మీద అవగాహన లేని పీసీసీ చీఫ్ రేవంత్ కూడా సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్ర శాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల కింద కాంగ్రెస్ పెట్టిన గోసలు మరిచిపోవద్దని, 9 ఏండ్లుగా కేసీఆర్ చేస్తున్న మంచిని మరిచిపోవద్దని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో ఆదివారం సుమారు రూ.2.10 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చే శారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రమూ ప్రేమ లేదని, ప్రజలకు ఏమి కా వా లో వారికి కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎన్నో చందమామ కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో గెలిస్తే రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ, మొన్ననే కర్ణాటకలో గెలిచింది కదా అక్కడ ఎందుకు 4 వేల పెన్షన్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రూ.200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు చేసింది కేసీఆరేనని, కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మొద్దని కోరారు.
కేసీఆర్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీనే ఉండే కదా ఇప్పుడున్న అభివృ ద్ధి అప్పుడు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీరు, సకాలంలో ఎరువులు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కులవృత్తులకు ప్రోత్సాహం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలకు, రైతులకు కేసీఆర్ భరోసా కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసి గెలిచిన ఎంపీ అర్వింద్ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మాటలు చెప్పడం కాదు, అభివృద్ధి చేసి చూపాలని సవాల్ చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ప్రజలంతా మంచి చేసిన కేసీఆర్కు మద్దతుగా నిలువాలని మంత్రి వేముల కోరారు.