KTR | సింగరేణి కుంభకోణం వెలికి తీయడంతో తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మొన్న హరీశ్‌రావుకు, నిన్న నాకు సిట్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. నైనీ బ్లాక్ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే నోటీసులు ఇచ్చారని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని రూ.50 లక్షలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అలాంటి దొంగ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడని అన్నారు. సింగరేణిలో రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి టెండర్ల గురించి హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టారని..అదే సాయంత్రం హరీశ్‌రావుకు సిట్ నోటీసులు పంపించారని తెలిపారు. బామ్మర్ది బాగోతం బయటపడగానే నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనే దొంగ.. తనకు తెలియకుండానే దొరికిపోతాడని తెలిపారు.
బామ్మర్ది కాంట్రాక్ట్ రద్దు అయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలకు పాల్పడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. మేం తప్పు చేయలేదు.. భయపడమని అన్నారు. రేవంత్ రెడ్డి జేజమ్మలకు కూడా భయపడమని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని.. మాకు ఏం సంబంధం లేదని తెలిపారు. పదిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్తానని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం తపన్పు చేసిందో.. అసలు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్లు సమాధానం చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు. చట్టాన్ని గౌరవిస్తాం.. మీరు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తామని తెలిపారు. మా గురి అంతా ప్రభుత్వ అసమర్థత, అవినీతిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న లుచ్చా పనులను ఎండగడతామని అన్నారు. కేసీఆర్ సైనికులుగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నాలుగు కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిని వదలమని అన్నారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసేంతవ రకు మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.