హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్‌ను మార్చి, రీ సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో తలసాని మాట్లాడారు. కులగణన సర్వే నిర్వహించి, కేవలం అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదని, ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సర్వే కోసం 57 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, అనేక అంశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, తమకెందుకులే, అవసరం లేదన్న భావనతో చాలా మంది సర్వేలో పాల్గొననేలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత 15 ఏండ్లలో బీసీల జానాభా అంతగా పెరగలేదని సర్వేలో వెల్లడైందని, రాష్ట్రాభివృద్ధిలో వెనుకబడిన వర్గాలది కీలకపాత్ర ఉన్నదని, జనాభా తగ్గితే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బీసీ, ఎసీ, ముస్లిం జనాభా తగ్గినట్టుగా ఓసీల జనాభా పెరినట్టుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించిన వివరాల ద్వారా తెలిసిందని, జనాభా తక్కువగా చూపితే రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు తగ్గే ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30% మంది కూడా సర్వేలో పాల్గొనలేదని, పాల్గొన్నవారిలో చాలామంది తమ వివరాలు చెప్పనేలేదని చెప్పారు. జనాభా దామాషా మేరకు రాజకీయ న్యాయం జరగాలని బీసీలు భావిస్తున్నారని తెలిపారు. కులాలవారీగా కూడా జనాభా వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని తలసాని డిమాండ్ చేశారు.
రాష్ట్ర జనాభా వాస్తవంగా 4.33 కోట్లు ఉండాల్సిందని, ప్రస్తుతం సర్వేలో 3.54 కోట్లే ఉన్నట్టు ప్రభుత్వం చెప్తున్నదని, మిగతా జనాభా ఏమైపోయినట్టు అని తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసెంబ్లీలో ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం 6-17 మధ్య వయస్కులు 62.30 లక్షలు, 0-6 మధ్య వయస్కులు 38.99 లక్షలు ఉన్నట్టు చెప్తున్నారు. అన్నీ కలిపితే మొత్తం రాష్ట్ర జనాభా 4.33 కోట్లు ఉండాల్సి ఉండగా, సర్వేలో 3.54 కోట్ల మందే ఉన్నట్టు చెప్పారు. మిగతా జనం ఏమైనట్టు అని ప్రశ్నించారు. గతంలో రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపామని, మళ్లీ ఇప్పుడు తీర్మానం చేసి పంపితే సరిపోదని, తమిళనాడు తరహాలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. 3.1% సర్వే చేయలేదని ప్రభుత్వం చెప్పిందని, దీనిపై కోర్టుకెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. 21 లక్షల మంది బీసీలు, 1.79 లక్షల మంది ఎస్సీలు, 1.66 లక్షల మంది మైనార్టీలు చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతున్నదని, దీనిపై క్లారిటీ తీసుకోవాలని తలసాని సూచించారు. ఉపకులాల వారీగా సైతం జనాభా వివరాలను వెల్లడించాలని తలసాని డిమాండ్ చేశారు.
కులగణన సర్వే భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు రోడ్మ్యాప్లాంటిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ ప్రవేశపెట్టిన తర్వాత పొన్నం మాట్లాడారు.