సిద్దిపేట : ఒక్కప్పుడు పొట్టకూటి కోసం దుబాయి పోయి బతికితే ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూలీ కోసం వలస వస్తున్నారు. అంబలి కేంద్రాల తెలంగాణ నుంచి ఎనిమిదేండ్లలో దక్షిణ భారత ధాన్యగారంగా తెలంగాణను మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
శుక్రవారం సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. 75 ఏండ్ల కింద మనం రాచరిక పాలనలో ఉన్నాం. ఎంతో మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారన్నారు.

1969లో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరిగింది. ఎప్పటి కప్పుడు రాచరిక, పెత్తందార్ల పెత్తనాన్ని ఈ గడ్డ తిప్పి కొట్టింది. యావత్ తెలంగాణ ప్రజానీకం సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించాం.ఈ మధ్య కొన్ని శక్తులు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాయి.
మతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారికి అధికారం పోతే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదని హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా మాట్లాడే కొంత మంది నాయకుల అజ్ఞానం చూస్తే జాలి వేస్తుందన్నారు. దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటున్నది. నవ తెలంగాణ నిర్మాణం కోసం మనం ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.