Electricity Connection | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలకు కొత్త విద్యుత్తు కనెక్షన్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ వద్ద పరికరాలు పాడైపోయినా కనీసం రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది. అవసరాలకు సరిపడా పరికరాల సరఫరా లేకపోవడంతో జాప్యం తప్పడంలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా విద్యుత్తు కనెక్షన్ కావాల్సినవారు ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్లు, స్తంభాలు ప్రైవేటుగా కొనుగోలు చేసుకుంటే, వాటిని బిగించేందుకు అవసరమైన ఏబీ స్విచ్లు, ఇన్సులేటర్లు, విద్యుత్తు సరఫరా నియంత్రణ పరికరాలు, సీటీ పీటీ మీటర్లను విద్యుత్తుశాఖ ఏర్పాటుచేస్తుంది.
వీటికి అయ్యే ఖర్చును వినియోగదారుడి నుంచి వసూలుచేస్తుంది. సహజంగా పరిశ్రమలకు వారం లోగా విద్యుత్తు కనెక్షన్ మంజూరుచేసి ట్రాన్స్ఫార్మర్ బిగించే ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేసుకున్నా.. సకాలంలో వీటిని సమకూర్చడంలో విద్యుత్తుశాఖ విఫలమవుతున్నది. దీంతో కనెక్షన్ల మంజూరులో జాప్యం తప్పడం లేదు.