హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘ప్రధాని మోదీ, సోనియా, రాహుల్, ఖర్గే, ప్రముఖులందరినీ ఆహ్వానించాం. రెం డు రోజుల సమ్మిట్‌లో మా విజన్ చూపబోతున్నం., ఎంతమంది హాజరవుతరో, ఎన్ని పెట్టుబడులస్తయో చూడాలి మరి..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను ఆయన శనివారం ప్రజాభవన్‌లో మీడియాకు వెల్లడించారు. ఇన్వెస్టర్లు రావాలనే ఉద్దేశంతో ఫ్యూచర్‌సిటీలో చేపట్టే ఈ సమ్మిట్‌ను 8వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారని, తొలిరోజు సీఎం రేవంత్‌రెడ్డి కీనోట్తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ప్రముఖుల ప్రసంగాలుంటాయని చెప్పారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సమ్మిట్‌కు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సైతం పిలుస్తామని భట్టి తెలిపారు.