హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని, హరితహారం కార్యక్రమంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడిందని తమిళనాడు అదనపు చీఫ్ సెక్రటరీ (అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ) సుప్రియ సాహూ ప్రశంసించారు. హరితహారం తరహాలోనే తమిళనాడులో గ్రీన్ మిషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సత్ఫలితాలిస్తున్న హరితహారం అధ్యయనం కోసం తమిళనాడు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఆనంద్‌తో కలిసి సుప్రియ సాహూ శనివారం రాష్ట్రంలో పర్యటించారు. తొలుత అరణ్యభవన్‌లో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రియాల్, శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 8 ఏండ్లుగా హరితహారం అమలు, సాధించిన ఫలితాలపై పీసీసీఎఫ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పచ్చదనం పెంపు యజ్ఞంలా సాగుతున్నదని, ఒక ప్రాధాన్య పథకంగా (ఫ్లాగ్షిప్ ప్రొగ్రాం) ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు. అనంతరం అధికారుల బృందం దూలపల్లి, శంషాబాద్‌లోని నర్సరీలు, కండ్లకోయ ఆక్సిజన్ పార్, సిరిగిరిపురం, నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అవుటర్ రింగ్ రోడ్డు గ్రీనరీని పరిశీలించారు.
నర్సరీల నిర్వహణతోపాటు, పచ్చదనం పెంచిన తీరు అద్భుతంగా ఉన్నదని, అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), అర్బన్ ఫారెస్ట్ పారులు చూడచక్కగా ఉన్నాయని కొనియాడారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణలో పచ్చదనం 6.7 శాతం పెరిగిందని, ఇటీవలే హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు లభించిందని అధికారులు బృందానికి వివరించారు. కాగా, పర్యటనలో ఫొటోలు, వీడియోలను సుప్రియ సాహూ ట్విట్టర్లో పోస్టు చేయగా గంటల్లోనే అవి వైరల్ అయ్యాయి. పర్యటనలో చీఫ్ కన్జర్వేటర్ రామలింగం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అటవీశాఖాధికారులు జాదవ్ రాహుల్‌కిషన్, జానకీరాములు పాల్గొన్నారు