Congress | పరిగి, మే 22: కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారికే ఇందిరమ్మ ఇళ్లంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు బాహాటంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకొంటూ, పేదలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్టు సీఎం, మంత్రులు ఓవైపు చెబుతుండగా, పరిగిలో జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు అశోక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని బహిరంగంగా చెప్పడం విడ్డూరం.
25శాతం ఇళ్లు అవతలి పార్టీ వారికి ఇవ్వాలని భట్టి విక్రమార్క చెప్పారని, తమ మండలంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నలుగురికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, కండువా కప్పుకోకుంటే ఇవ్వలేదని పేర్కొనడం గమనార్హం. అదే స్టేజీపై ఉన్న స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, పార్టీ నాయకులు సదరు నాయకుడిని వారించలేదంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలను కాంగ్రెస్ వారికే ఇస్తున్నదనే విషయాన్ని ధ్రువీకరించినట్లు అయిందని పలువురు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లని అశోక్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.