Revanth Reddy | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తెర్లయిపోవడం వెనుక అధికార కాంగ్రెస్ అవివేకం, పాలకుల అసమర్థతతోపాటు నమ్మించి చేసిన మోసం దాగి ఉన్న ట్టు తాజాగా వెల్లడైంది. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాలకు కాంగ్రెస్ చేసిన నమ్మకద్రోహమే ప్రధాన కారణమని తేటతెల్లమైంది. అమలు చేయలేని గ్యారెంటీలు ఇస్తే రాష్ట్రం ఆగమైపోతదని తెలిసి కూడా కాంగ్రెస్ హామీలు గుప్పించి రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఓ టీవీ చానల్ కా ర్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన నమ్మక ద్రోహానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. రేవంత్రెడ్డి, మీడి యా ప్రతినిధి సంభాషణ ఇలా కొనసాగింది.
జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్: తెలంగాణ ప్రభుత్వానికి రూ.3.75 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినా గ్యారెంటీల పేరిట ఎన్నికల్లో అన్ని రకాల హామీలు ఇచ్చారు. ఉదాహరణకు నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు పలు హామీలిచ్చారు. ఫండ్స్ లేనప్పుడు మీరు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు?
సీఎం రేవంత్: తెలంగాణ అప్పులు రూ. 3.75 లక్షల కోట్లు కాదు. తెలంగాణ అప్పులు రూ.7 లక్షల కోట్లు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు. దీంట్లో నుంచి ప్రభుత్వోద్యోగులకు వేతనాలు, పింఛ న్ల చెల్లింపునకు రూ.6,500 కోట్లు ఖర్చు చేయాలి. అప్పులు, వడ్డీలకు మరో రూ. 6,500 కోట్లు కట్టాలి. అలా తిన్నా తినకు న్నా.. ఛాయ్ తాగినా.. తాగకపోయినా.. రూ.13 వేల కోట్లను నెలలో పదో తేదీ రాకముందే కట్టాలి. ఇక మిగిలిన రూ.5,500 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఇది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. తెలంగాణ అంత మంచిగేంలేదు.
జర్నలిస్ట్ రాజ్దీప్: గ్యారెంటీల సంగతేంటి? నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఎలా?
సీఎం రేవంత్: సరైన ప్రశ్న వేశారు రాజ్దీప్ జీ.. మీలాగే, నేను కూడా తెలంగాణ అప్పులు రూ.3.75 లక్షల కోట్లని భ్రమపడ్డా. అందుకే, వచ్చే ఆదాయంతో గ్యారెంటీల కోసం ఏమైనా చేయవచ్చని అనుకొన్నా. కుర్చీలో కూర్చున్న తర్వాత అసలు విషయం తెలిసొచ్చింది.
జర్నలిస్ట్ రాజ్దీప్: (ఆశ్చర్యపడుతూ..) సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ‘గ్యారెంటీలకు డబ్బులు ఖర్చు చేయలేనని’ మీకు అర్థమైందని ఇప్పుడు చెప్తున్నారా?
సీఎం రేవంత్: గ్యారెంటీలకు కాదు.. రుణాల చెల్లింపుల గురించి చెప్తున్నా.
జర్నలిస్ట్ ప్రీతి: గ్యారెంటీల గురించి అడిగితే అప్పుల గురించి చెప్తున్నారు. రెడ్డి గారూ.. దీనికి సంబంధించి నేను కొన్ని గణాంకాలు చెప్తాను. అప్పులు ఉన్నాయని తెలిసినప్పటికీ.. 2024 బడ్జెట్లో రూ.50 వేల కోట్ల ను గ్యారెంటీలకు కేటాయించారు. కొత్త అప్పులు రూ.80వేల కోట్లు చేయనున్నట్టు చెప్పారు. అప్పులు ఉన్నప్పుడు హామీలెలా ఇచ్చారు?
సీఎం రేవంత్: మరేం చెయ్యాలి. రేసు (ఎన్నికల పరుగుపందెం) నడుస్తుంది కదా ప్రీతీజీ ! రేసులోకి (ఎన్నికల బరిలోకి) దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరుగెత్తాల్సిందే. ‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’ అనే స్లోగన్ తెలుసు కదా.. ఇదీ అలాగే..! ఉచితాలకు వ్యతిరేకంగా ప్రచా రం చేసిన మోదీ ఢిల్లీలో ఉచిత గ్యారెంటీలు ఇ చ్చారు. మరెవ్వరూ ఆయన్ని ప్రశ్నించరేం? ప్రభుత్వం తరఫున కనీసం రూ.500 కోట్లను కూడా మూలధన వ్యయానికి, పెట్టుబడులకు ఖర్చుచేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు.