Harish Rao | రాష్ట్రంలోని గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటలను హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలపై సుమోటోగా కేసు స్వీకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రెండు చేతులు జోడించి అభ్యర్థించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి కలుషితాహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థినిలను హరీశ్‌రావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ..గురుకుల విద్యార్థుల గురించి పట్టించుకోవా? బావి భారత పౌరులైన ఈ విద్యార్థుల భవిష్యత్తుపైన మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడం కూడా చేతకాదా ఈ ప్రభుత్వానికి అని ప్రశ్నించారు. బాలల దినోత్సవం నాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయితే అధికారులను సస్పెండ్ చేస్తా అని ప్రగల్బాలు పలికాడని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి.. నువ్వే విద్యాశాఖ మంత్రివి. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే కూడా స్పందించవా అని నిలదీశారు. అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టావు… అందాల భామలను చూడడానికి అందాల పోటీలకు ఐదుసార్లు పోయావు. మరి అనారోగ్యానికి గురైన ఈ పిల్లలను చూడడానికి ఆసుపత్రికి రావా అని నిలదీశారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఆసుపత్రి పాలైతుంటే వాళ్ళని పరామర్శించాలని ఎందుకు మీకు అనిపించదు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు నిలదీశారు. వారికి మంచి భోజనం పెట్టాలని ఎందుకు నీకు అనిపించదని ప్రశ్నించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూలు పెడతా అని డబ్బా కొట్టిన రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు. ఒక స్కూల్ కట్టింది లేదు అని హరీశ్‌రావు విమర్శించారు. ఉన్న గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టకుండా ఏడిపించే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. “ఒక విద్యార్థిని తల్లి రూప అనే మహిళ నన్ను కలిశారు. వారు బండై గుట్ట గ్రామం కొల్లాపూర్ నుంచి వచ్చారు.. నిన్న వారి బిడ్డ కలుషిత ఆహారం తిని ఆసుపత్రిపాలైందని తెలిసి వచ్చింది. ఆదివారం రోజు విద్యార్థులకు పెట్టవలసింది పూరి, చపాతి. కానీ ఉదయం పెట్టింది సాంబారు అన్నం. ఆ సాంబార్లో కూడా పురుగులు వచ్చాయని ఆ తల్లి స్వయంగా చూసి చెప్పింది. ” అని తెలిపారు. గురుకులాల్లో మెనూ కూడా ఈ ప్రభుత్వం పాటించడం లేదని తెలిపారు. ప్రతీరోజు ఏదో ఒక జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు అన్ని జిల్లాలో రోజుకి 100 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు అని తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన అని మండిపడ్డారు.
ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసి వారి జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండని సూచించారు. బీఆర్ఎస్ మీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూస్తూ ఊరుకోదు.. మళ్లీ గురుకుల బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్ లో జరుగుతున్న సంఘటనలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీన్ని సుమోటోగా తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోండని కోరారు.