హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తం 1,90,63,058 గొర్రెలతో రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకొన్నది. నిరుడు కూడా గొర్రెల సంఖ్యలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలువగా, ఆ రికార్డును ఈ ఏడాది కూడా కొనసాగించింది. కేంద్ర పశు సంవర్ధక శాఖ 2021-22కు సంబంధించి 20వ పశుగణన నివేదికను విడుదల చేసింది. తెలంగాణ తర్వాత 1.76 కోట్ల గొర్రెలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, 1.10 కోట్ల గొర్రెలతో కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణలో అన్ని రకాల జీవాలు కలిపి 3.26 కోట్లు ఉన్నాయి. ఇందులో రాష్ట్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. తొలి స్థానంలో ఏపీ, రెండో స్థానంలో తమిళనాడు ఉన్నాయి. దేశానికి అవసరమవుతున్న మొత్తం గుడ్లలో తెలంగాణ నుంచి 12.86 శాతం వస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ నుంచి 10.82 శాతం మాంసం ఉత్పత్తి అయినట్టు వెల్లడించింది.
గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను సీఎం కేసీఆర్ అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకం అద్భుత ఫలితాలను అందిస్తున్నది. ఈ పథకం కారణంగానే ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా అవతరించింది. అలాగే, రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగింది. తద్వారా తెలంగాణ మాంసం ఉత్పత్తిలో దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. 2014-15లో తెలంగాణలో కేవలం 5.05 లక్షల టన్నుల మాంసం మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ప్రస్తుతం ఇది 10.85 లక్షల టన్నులకు పెరగడం విశేషం. అంటే ఎనిమిదేండ్లలో ఏకంగా 115 శాతం మాంసం ఉత్పత్తి పెరిగింది. ఈ పథకం కింద మొదటి విడతలో ఇప్పటి వరకు రూ.5 వేల కోట్ల ఖర్చుతో 3.93 లక్షల మందికి సుమారు 87 లక్షల గొర్రెలను తెలంగాణ సర్కారు పంపిణీ చేసింది. తాజాగా ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకు సుమారు రూ.6 వేల కోట్ల నిధులను వెచ్చించనున్నది.