హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేసిందని చెప్పారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కన్న 254 శాతం అదనపు ఉత్పత్తి సాధించడం గర్వకారణం అన్నారు.
కేంద్రంలోని మోదీ సరారు ఇచ్చిన పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో బీజేపీ పాలిత రాష్ట్రాలే చతికిలపడ్డాయని ఎద్దేవాచేశారు. గుజరాత్ 108 శాతం, కర్ణాటక 110 శాతం ఉత్పత్తి చేయగా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పూర్తిగా వెనుకబడి పోయాయని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలోనే తెలంగాణ ఈ ఘనత సాధించిందని స్పష్టంచేశారు. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి కృషి, ప్రోత్సాహానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.