(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘దేశంలోని సగానికి పైగా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాం. ప్రతీ ఇద్దరు భారతీయుల్లో ఒకరి మద్దతు మాకే ఉన్నది’ అంటూ పొద్దున లేచింది మొదలు.. బీజేపీ నేతలు గప్పాలు కొట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే, వాస్తవానికి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని విశ్లేషిస్తే, కేవలం 28 శాతం మంది ప్రజలే కమలదళానికి మద్దతు ప్రకటిస్తున్నట్టు అర్థమవుతున్నది. దేశంలో మొత్తం 28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో రెండు యూటీలు ఢిల్లీ, పుదుచ్చేరితో కలిపి శాసనసభలు ఉన్న మొత్తం రాష్ర్టాల సంఖ్య 30. ఇందులో 16 రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి.
కేవలం 10 రాష్ర్టాల్లోనే బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఇందులో రెండు రాష్ర్టాలు యూపీ, గుజరాత్ మినహా మిగతా 8 రాష్ర్టాలన్నీ చిన్నాచితకవే. ఇక, మిత్రపక్షాల మద్దతుతో 6 రాష్ర్టాల్లో కమలదళం అధికారంలో ఉన్నది. మరోవైపు, బీజేపీ అధికారంలో ఉన్న 16 రాష్ర్టాల్లో 8 రాష్ర్టాల్లో దొడ్డిదారిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ద్వారానే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ర్టాల్లో కమలదళం అధికార పగ్గాలు చేపట్టింది. బేరసారాలు జరుపకుండా, రాజ్యాంగబద్ధంగా స్వతహాగా బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ర్టాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటే.. ఆ పార్టీకి కేవలం 28.3 శాతం ప్రజల మద్దతు (రాష్ర్టాలు, జనాభా ప్రాతిపదికన) ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.