SRSP | కరీంనగర్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఉత్తర తెలంగాణకు వరదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కాకతీయ కాలువ కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. కరీంనగర్ జిల్లా పరిధిలోని చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టుకు సరిపడా నీరు అందక రైతులు అవస్థ పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమృద్ధిగా నీరు లభించడంతో రైతులు సమృద్ధిగా పంటలు పండించారు.
ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం ప్రాజెక్టు పరిధిలో యాసంగి పంటలకు 64.18 టీఎంసీల నీటిని అందించాలని ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు.. కాకతీయ ఎగువ కాలువ పరిధిలో 41.43 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో గత డిసెంబర్ 18 నుంచి ఆయకట్టుకు నీళ్లు వదులుతున్నారు. నీటి సరఫరాకు డీబీఎం-5 నుంచి డీబీఎం 54 వరకు జోన్-1గా, డీబీఎం 54 నుంచి డీబీఎం 94 వరకు జోన్-2గా విభజించుకున్నారు.
రెండు జోన్లకు ఏడు తడులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో జోన్-1కు 3,500 క్యూసెక్కులు, జోన్-2కు 5,500 క్యూసెక్కుల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. జోన్-2 పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లాకు డిసెంబర్ 18 నుంచి 25 వరకు మొదటి తడి, జనవరి 9 నుంచి 17 వరకు రెండో తడి నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ, మధ్య ఆయకట్టుకు కూడా సరిగ్గా నీరందని పరిస్థితి నెలకొన్నది.
తడి ఆరుతున్న పొలాలు
కరీంనగర్ జిల్లా పరిధిలో ఎగువ కాకతీయ కాలువకు డీ-87 నుంచి డీ-94 వరకు మొత్తం ఎనిమిది డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల పరిధిలో సుమారు 22 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అయితే, చొప్పదండి, కరీంనగర్ మండలాల్లోని మధ్య ఆయకట్టుకు కూడా నీళ్లందని పరిస్థితి కనిపిస్తున్నది. కరీంనగర్ మండలం బొమ్మకల్, దుర్షేడు, గోపాల్పూర్, చేగుర్తి, ముగ్ధుంపూర్, మందులపల్లి, తదితర గ్రామాలకు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగు నీరు అందలేదు.
దీంతో రైతులు ఎక్కువగా భూగర్భ జలాల మీద ఆధారపడి వరినాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండటం రైతులను కలవరపెడుతున్నది. ఒకప్పుడు రోజుకు 12 గంటలు వాడినా తగ్గని బావులు, బోర్లలో ఇప్పుడు ఐదారు గంటలు కూడా నీళ్లు ఉండటం లేదు. ఇప్పటికే నాట్లు వేసిన పొలాలు తడి ఆరిపోతున్నాయి. అక్కడక్కడా నెర్రెలు విచ్చుతున్నాయి. మరి కొద్ది రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటే పంటలు ఎండిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఈ పరిణామాలను గ్రహించిన రైతులు ఇప్పటివరకు పోసిన నారు మళ్లను వదిలేస్తున్నారు. యాసంగిలో నాలుగైదు ఎకరాలు వేసుకోవాలని ఆశించిన రైతులు ఇప్పుడు ఎకరం, అరెకరానికే పరిమితం అవుతున్నారు. మరోవైపు, నీటి ఎద్దడి వస్తుందనే కారణంగా ప్రధాన కాలువ ఎగువ ప్రాంత రైతులు డీబీఎంలను తెరిచి పెడుతున్నట్టు తెలుస్తున్నది.
దీంతో చివరి ఆయకట్టు మాట దేవుడెరుగు మధ్య ఆయకట్టు సైతం తడిచే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వచ్చే నీటిని అడ్డుకోవద్దని మౌఖిక ఆదేశాలు అధికారులకు అందినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు సాగు చేయడమా? లేదా? అనే సందిగ్ధంలో పడుతున్నారు.

ఇట్లనే ఉంటే రోడ్లెక్కుడైతది..
నిరుడు యాసంగిలో బొమ్మకల్, గుంటూరుపల్లి, గోపాల్పూర్, దుర్షేడు, చేగుర్తిలో ఈ సమయానికే నాట్లేసుడు అయిపోయింది. అప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండేది. కరెంట్ సతాయించేది కాదు. ఇప్పుడు నీళ్లు వస్తలేవు. రైతులందరూ బావులు, బోర్ల మీదనే ఆధారపడ్డరు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నయి. నాలుగైదు రోజుల సంది కరెంట్ సతాయిస్తున్నది. గంటకోసారి ట్రిప్పైతంది. మళ్ల మునుపటి పరిస్థితులు వస్తయా ఏందని రైతులందరూ భయపడుతున్నరు.
నీళ్లస్తలేవని రైతులు పోసిన నార్లు వదిలేస్తున్నరు. డిస్ట్రిబ్యూటరీల నుంచి 500 క్యూసెక్కుల నీళ్లు వస్తేనే చివరి ఆయకట్టు వరకు నీళ్లొస్తాయి. కానీ రెండు మూడు వందల క్యూసెక్కుల నీళ్లు మాత్రమే ఇస్తున్నరు. కాలువ మొదట్ల ఉన్న రైతులకే సరిపోత లేవు. మధ్యన, చివరన ఉన్న ఆయకట్టుకైతే ఆయింతకు వస్త లేవు. పట్టించుకునెటోళ్లు కనిపిస్త లేరు. పరిస్థితి ఇలాగే ఉంటే మునుపటి లెక్కనే రైతులు రోడ్లెక్కుడైతది.
– మంద తిరుపతి, గోపాల్పూర్ రైతు
రెండు రోజులే నీళ్లొచ్చాయి
పొలంలో దీనంగా కూర్చున్న ఈ రైతు పేరు ఎనుముల తిరుపతి. కరీంనగర్ మండలం గోపాల్‌పూర్‌కు చెందిన తిరుపతి ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. వారం పది రోజుల క్రితమే నాట్లు వేశారు. ప్రాజెక్టు నీళ్లుపై ఆశలు పెట్టుకున్న తిరుపతి ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నాడు. కాలువ నుంచి ఇప్పటివరకు రెండు తడుల నీళ్లు వదలగా, ఇతని పొలానికి రెండు రోజులు మాత్రమే వచ్చాయి.
బావిలో నీళ్లు వాడుకుందామంటే నాలుగైదు గంటలు కూడా నడవకుండానే అడుగంటి పోతున్నది. దీంతో పొలానికి నీళ్లు సరిపోవడం లేదు. ఇప్పటికే నాలుగు మళ్లు తడి ఆరిపోయాయి. ఒక మడిలో నెర్రెలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పొలం ఎండిపోతుందని తిరుపతి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని అనేకమంది రైతుల పరిస్థితి ఇలాగే ఉన్నది. నీటిని విడుదల చేసినప్పుడు పైన ఉన్న డిస్ట్రిబ్యూటర్లను మూసి వేయకుంటే చివరి ఆయకట్టులో ఉన్న తమ పంటలకు నీళ్లందక తీవ్ర నష్టం జరుగుతుందని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేసింది రెండెకరాలే అయినా..
ఇతని పేరు బూసారపు లక్ష్మణ్. కరీంనగర్ మండలం దుర్షేడు శివారులో ఇతనికి నాలుగెకరాల పొలం ఉన్నది. ఐదారేండ్లుగా వానకాలం, యాసంగి సీజన్లలో మొత్తం నాటు వేస్తున్నాడు. ఒక్క సీజన్లో కూడా ఎండకుండా పంట చేతికొచ్చింది. కాలువ నీళ్లు సక్రమంగా రావడంతోనే ఇది సాధ్యమైందని, గతంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలోనే నీళ్లు ఇచ్చినా చివరి వరకు అందాయని లక్ష్మణ్ చెప్తున్నారు. నీటిని నిలిపేసినపుడు బావుల్లో ఉన్న నీళ్లను వాడుకున్నామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నాడు. ఈసారి ఉన్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలే సాగు చేసినా నీళ్లు సరిపోక పొలం ఎండిపోతున్నదని వాపోతున్నాడు.
ఆశ వదులుకుని మక్క వెట్టుకున్న
కాలువ నీళ్లు వస్తయనే ఆశ వదులుకుని ఈసారి పొలం ఎయ్యలే. మక్క వెట్టిన. బాయిల నీళ్లున్నంత సేపు మక్క పారించుకుంట. బాయి ఎండిపోతే మక్క ఎండుతది. ఏంజేసుడు మరి? మునుపు అంత పొలమే ఏసిన. కానీ, ఇప్పుడు కాలువ నీళ్లు వస్త లేవు కదా. చాలా మందే నాట్లేసుడు బంజేసిండ్రు. నీళ్లు రాక ఎండిపోతే పెట్టుబడులు మీదవడ్తయని భయపడుతున్నరు. ఐదారేండ్ల సంది ఇసోంటి పరిస్థితి రాలే. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినంకనైతే ఎండకాలం సైతం చెరువుల్లో నీళ్లు ఉండేది. బాయిలు సైతం ఉబ్బుతుండే. వానకాలం పంట చేతికొచ్చినప్పటి సంది నీళ్లు రాకపాయె. మళ్ల పొలాలు దున్నడానికి బాయిల నీళ్లు వాడుతున్నరు. కరెంటు సైతం ఎద్దెమెద్దెమే వస్తంది. ఈసారి ఎవుసం ఖతమే.
– ఆవుల సంపత్, దుర్షేడు రైతు
ఇక్కడి వరకు నీళ్లే రాలేదు
ఇది కరీంనగర్ మండలం దుర్షేడులోని డీ-94 ప్రధాన కాలువ. ఇది కొత్తపల్లి మండలం మల్కాపూర్ వద్ద ఎగువ కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉండి మల్కాపూర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడు, చేగుర్తి, నల్లగుంటపల్లి వరకు సాగు నీటిని అందిస్తుంది. ఇప్పటికే రెండు తడులు వదిలినప్పటికీ బొమ్మకల్, గోపాల్పూర్ గ్రామాలకు చివరి రెండు రోజులు మాత్రమే నీళ్లొచ్చాయి. దీనికి కుడి, ఎడమల్లో ఉన్న పిల్ల కాలువల్లో ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తున్నది. నీళ్లు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. వీటి పరిధిలో సాగు చేస్తున్న రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పోసుకున్న నార్లను వదిలేస్తున్నారు.