ఇల్లంతకుంట రూరల్, ఫిబ్రవరి 22: రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన కముటం శ్రీనివాస్‌కు ఊళ్లో ఎకరంన్నర భూమి ఉన్నది. వ్యవసాయమే జీవనాధారం. డిసెంబర్లో యాసంగి పంట కింద వరి వేశాడు. ఇప్పటి వరకు మొత్తం రూ.40 వేల దాకా పెట్టుబడి పెట్డాడు. వరి పొట్టదశకు వచ్చింది. తీరా సమయానికి బావిలో నీళ్లు అడుగంటి పోవడంతో గత్యంతరంలేని పరిస్థితిలో రోజుకు రూ.3 వేలు కిరాయి పెట్టి పొద్దున రెండు, సాయం త్రం రెండు ట్యాంకర్ల నీళ్లు పోయిస్తున్నాడు.
మరో 20 రోజులు ఇలా నీళ్లు పారిస్తేనే పంట చేతికందుతుందని, అప్పుచేసి పంటను కాపాడుకోవాల్సి వస్తుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు సాగునీళ్లు వచ్చాయని, కాంగ్రెస్ వచ్చాక కన్నీళ్లే తప్ప సాగునీళ్లు రావడం లేదని వాపోతున్నాడు. ఈ ఒక్క శ్రీనివాసే కాదు ఇల్లంతకుంట మండలంలో పెద్దలింగాపూర్, రహీంఖాన్‌పేట, దాచారం, వెల్జిపూర్, వల్లంపట్ల, ఓబులాపూర్, గూడెపుపల్లి తదితర గ్రామాల్లో రైతులందరి పరిస్థితి ఇలాగే ఉన్నది. సాగునీళ్లు లేక ఆగమైపోతున్నారు.