ధర్మారం: ఆపదలో ఉన్న అన్నదాతలకు కాళేశ్వరం ప్రాజెక్టు అండగా నిలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం దూర దృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతూ పంటలకు ప్రాణం పోస్తుంది. వివరాలలోకి వెళితే.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా చేపట్టిన రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువకు అనుబంధంగా సాగుచేసిన పంటల సంరక్షణ కోసం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రక్రియను నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలోని గాండ్లపేట వద్ద వరద కాలువకు గండి పడటంతో ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేయని పరిస్థితి ఏర్పడింది. దీంతో వరద కాలువలో నీరు లేకపోవడం అట్టి కాలువ ఎగువ బాగాన రైతులు సాగుచేసిన వరి పంటలకు నీటి సరఫరా లేకపోవడంతో నీటిని విడుదల చేయాలని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు రోజులపాటు సాగునీటిని తరలించాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సంకల్పించారు. అధికారుల ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 లోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నంది రిజర్వాయర్(Nandi Reservoir) నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియను ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు చేపట్టారు.
గురువారం ఉదయం 10:30 గంటలకు నంది పంప్ హౌస్ లోని 5వ మోటార్‌ను ఆన్ చేశారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు నంది పంపు హౌస్‌లోని సర్జి ఫూల్‌కు చేరుకుంటుంది. ఇట్టి పంప్ హౌస్ నుంచి ఏకైక మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల జలాలు నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు. అదే పరిమాణంలో రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో గ్రావిటీ కాలువ ద్వారా నీరు ప్రవహించి 8 ప్యాకేజీ లోని జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని పంప్ హౌస్ కు చేరుకుంటుంది. అదే పరిమాణంలో అక్కడి పంప్ హౌస్ లోని బాహుబలి మోటార్ ను ఆన్ చేయడంతో నీరు గ్రావిటీ కాలువ ద్వారా వెళ్లి వరద కాలువలోకి చేరుతుంది. దీంతో రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి జిల్లాలు ఎగువ ప్రాంతానికి అధికారులు తరలిస్తున్నారు.
శుక్రవారం కూడా నంది పంప్ హౌస్ లోని 5వ మోటార్ ద్వారానే నీటి ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగుతుందని ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. రెండు రోజులపాటు కొనసాగిన అనంతరం శనివారం ఉదయం 10:30 గంటలకు నిలిపివేస్తారని సమాచారం. కాగా ఇంతటి ఆపద కాలంలోనైనా కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద దిక్కు అవుతుంది. గత ఏడాది యాసంగి సీజన్ లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కు అనుబంధంగా ఉన్న వేం నూరులో మోటార్లు మొరాయించడంతో చివరకు నంది పంప్ హౌస్ లోని మోటార్లను ఆన్ చేసి నంది రిజర్వాయర్ ద్వారా సాగునీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్ లైన్ ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ కు తరలించి వరి పంటలకు నిరందించారు.